Ap Liquor Scam: వాసుదేవరెడ్డి అక్రమాలు చూసి నిర్ఘాంతపోయిన సీఐడీ

by srinivas |   ( Updated:2024-07-19 12:39:59.0  )
Ap Liquor Scam: వాసుదేవరెడ్డి అక్రమాలు చూసి నిర్ఘాంతపోయిన సీఐడీ
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు ప్రధాన నిందితుడు వాసుదేవరెడ్డి అక్రమాలు చూసి సీఐడీ అధికారులు నిర్ఘాంతపోయారు. లిక్కర్ పాలసీపై నిర్ణయాలు తీసుకునే బాధ్యతను వాసుదేవరెడ్డికే గత ప్రభుత్వం అప్పగించినట్లు అధికారులు గుర్తించారు. 2019-2024 మధ్య బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ, డిస్టిలరీల కమిషనర్‌గా పని చేసిన ఆయన ఆ సమయంలో మద్యం కొనుగోళ్లకు సంబంధించి అధికారులను బెదిరించినట్లు విచారణలో తేలింది. ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కమిషనర్‌కు ఫైళ్లు వెళ్లకుండా వాసుదేవరెడ్డి అడ్డుకున్నారని అధికారులు గుర్తించారు. ఒకే బ్రాండ్ మద్యాన్ని తెలంగాణ కంటే ఏపీలోనే డిస్టిలరీల నుంచి ఎక్కువగా కొనుగోళ్లు చేసినట్లు సీఐడీ అధికారులు నిర్దారించారు. బినామీ పేర్లతో వాసుదేవరెడ్డి డిస్టిలరీల వ్యాపారంలోకి చొరబడినట్లు గుర్తించారు. తక్కువ ధర ఉన్న కొన్ని మద్యం బ్రాండ్లను రాత్రి రాత్రికే తప్పించినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. 2014-19 మధ్య తక్కువ ధర ఉన్న 32 మద్యం బ్రాండ్లను జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2కు కుదించినట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది. ఆ రెండు బ్రాండ్లకు కూడా జగన్ ప్రభుత్వం పేర్లు మార్చి ఎక్కువ ధరకు మద్యాన్ని అమ్మి సొమ్ముకున్నట్లు సీఐడీ గుర్తించింది. ప్రీమియం బ్రాండ్ తరహాలోనే కొత్త బ్రాండ్లతో మద్యాన్ని తయారీ చేసి ఎక్కువ రేట్లకు అమ్మకాలు జరిపినట్లు విచారణలో తేలింది.

ఇక సబ్ లీజుల పేరుతో అప్పటి ముఖ్యమంత్రి జగన్ అనుచరులు 11 డిస్టిలరీలను సొంతం చేసుకున్నట్లు విచారణలో అధికారులు గుర్తించారు. అలా 11 డిస్టిలరీల ద్వారా వాసుదేవరెడ్డి 65 శాతం మద్యం కొనుగోలు చేశారని సీఐడీ అధికారులు తెలుసుకున్నారు. చంద్రబాబు హయాంలో ఉన్న టాప్ 5 బ్రాండ్ల కొనుగోలును 2019లో నిలిపివేసినట్లు తేల్చారు. అలా మద్యంపై వచ్చిన ఆదాయాన్ని జగన్ ప్రభుత్వం తాకట్టు పెట్టినట్లు గుర్తించారు. అంతేకాదు మద్యం ఆదాయం రూ. 14,276 కోట్లను అప్పుల చెల్లింపునకు ఏపీడీఎస్డీసీకి మళ్లించినట్లు అధికారుల విచారణలో బయటపడింది. అయితే వాసుదేవరెడ్డి చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండటంతో సీఐడీ అధికారులు నిర్ఘాంతపోతున్నారు. మద్యం కొనుగోళ్లలో భారీగా అక్రమాలు జరిగాయని, వాటిని అంచనా వేయలేకపోతున్నారు. మద్యం కుంభకోణానికి సంబంధించి అధికారుల నుంచి ఇంకా పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. సంచలన నిజాలు బయటపడుతుండటంతో విచారణను సీఐడీ అధికారులు వేగవంతం చేశారు.

Advertisement

Next Story