Shock for YV Subbareddy.. టీటీడీ కొత్త చైర్మన్‌గా​ జంగా?

by srinivas |   ( Updated:2022-12-28 14:36:07.0  )
Shock for YV Subbareddy.. టీటీడీ కొత్త చైర్మన్‌గా​ జంగా?
X

దిశ, ఏపీ బ్యూరో: తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్‌గా సీఎం జగన్​బాబాయి వైవీ సుబ్బారెడ్డిని తప్పించనున్నట్లు తెలుస్తోంది. ఈ పదవి రేసులో పార్టీ కీలక నాయకులు ముగ్గురు పోటీ పడుతున్నట్లు సమాచారం. అందులో ప్రధానంగా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి ఇచ్చే అవకాశం ఉందని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత పాలక మండలి పదవీ కాలం వచ్చే ఏడాది ఆగస్టుతో ముగియనుంది. ఇంత అత్యవసరంగా సుబ్బారెడ్డిని తప్పించి వేరొకరికి ఇవ్వాలని నిర్ణయం వెనుక కారణాలు ఏంటనేది పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ప్రభుత్వ కీలక పదవుల్లో కేవలం రెడ్డి సామాజిక వర్గానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నట్లు విపక్షాలు కోడై కూస్తున్నాయి. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు మంత్రి మండలిలో తగు ప్రాతినిధ్యం కల్పించారు. అయినా సలహాదారుల నుంచి ప్రధాన పదవుల్లో సీఎం జగన్​సొంత కులం వాళ్లకే ఇస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇలాంటి సమయంలో బీసీలను మరింత దగ్గర చేసుకునేందుకు టీటీడీపీ ఛైర్మన్ పదవిని బీసీలకు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే బీసీ అయిన జంగా కృష్ణమూర్తి పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. అటు వైవీ సుబ్బారెడ్డి ఉమ్మడి విశాఖ జిల్లా సమన్వయకర్తగా కీలక బాధ్యతల్లో నిమగ్నమై ఉన్నారు. ఆయన మరింత ఎక్కువ సమయం పార్టీకి కేటాయించేందుకే సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సొంత బాబాయిని సైతం పదవి నుంచి తప్పించారనే సానుభూతి కూడా వస్తుందని భావిస్తున్నట్లున్నారు.

ఇక వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ముగిసిన తర్వాత కొత్త చైర్మన్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశమున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. చైర్మన్​ రేసులో ఉన్న పల్నాడు జిల్లా గురజాలకు చెందిన జంగా కృష్ణమూర్తి రాష్ట్ర బీసీ సెల్​అధ్యక్షులుగా పార్టీకి సేవలందిస్తున్నారు. పార్టీ అధికారానికి రాగానే సీఎం జగన్​ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు. గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్​రెడ్డితో కొంతమేర విభేదాలున్నా జంగా కృష్ణామూర్తి ఎక్కడా బయటపడకుండా నెట్టుకొస్తున్నారు. ఆయన విధేయతకు తగు గుర్తింపునిస్తూ టీటీడీ చైర్మన్​పదవిని కట్టబెట్టే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.

అప్పట్లో టీడీపీ ప్రభుత్వం చివర్లో ఇదే ప్రయోగం చేసింది. పుట్టా సుధాకర్​యాదవ్‌కు టీటీడీ చైర్మన్‌గా ఇచ్చింది. ఆయన పదవీ కాలం ముగియక ముందే ఎన్నికలొచ్చాయి. టీడీపీ ఓటమి పాలైనా ఆయన పదవికి రాజీనామా చేయలేదు. కొన్నాళ్లపాటు పాలకమండలి కొనసాగింది. తర్వాత ఆయనతోపాటు బోర్డు సభ్యులు రాజీనామా చేసిన తర్వాత వైవీ సుబ్బారెడ్డి పూర్తి స్థాయిలో పాలక పగ్గాలు చేపట్టారు. ఇప్పుడు బీసీల్లో పట్టు నిలుపుకోవడానికి వైసీపీ ఇదే ఎత్తుగడను అనుసరిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Advertisement

Next Story