ఎస్వీయూలో కొనసాగుతున్న మూడు రోడ్ల రగడ.. విద్యార్థి సంఘాల ర్యాలీ

by Javid Pasha |
ఎస్వీయూలో కొనసాగుతున్న మూడు రోడ్ల రగడ.. విద్యార్థి సంఘాల ర్యాలీ
X

దిశ, తిరుపతి: విద్యార్థి సంఘం నేతపై వైసీపీ నేతల దాడికి నిరసనగా ఎస్వీ యూనివర్సీటీలో విద్యార్థి సంఘాలు మంగళవారం ఉదయం ర్యాలీ నిర్వహించారు. తమ విద్యార్థిపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.తమపై దాడి చేసిన వ్యక్తి ఎస్వీ యూనివర్సిటీలో తిరుగుతున్నప్పటికీ పోలీసులు అరెస్ట్ చేయకపోవడంపై సీఐను విద్యార్థులు నిలదీశారు. తమపై దాడి చేసిన వారిని అరెస్టు చేసేంత వరకు పోరాటం ఆగదని విద్యార్థులు స్పష్టం చేశారు. మాస్టర్ ప్లాన్ రోడ్‌ను వ్యతిరేకిస్తున్న విద్యార్థి సంఘం నేతలకు ప్రాణహాని ఉందని, తమపై దాడి చేయడానికి వైసీపీ గుండాలను దింపిందని విద్యార్థి సంఘం నేతలు ఆరోపించారు. కాగా.. ఎస్వీయూనిర్సిటీలో మూడు రోడ్ల నిర్మాణాన్ని విద్యార్థి సంఘాలు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. మూడు రోడ్ల ప్రతిపాదనను రెండు రోడ్లకు మున్సిపల్ కార్పొరేషన్ మార్చుకుంది. అయితే ఈ ప్రతిపాదనకు మద్దతు తెలపాలని సోమవారం ఓ విద్యార్థి సంఘం నేతపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. దాడి నేపథ్యంలో ఎస్వీ యూనివర్శిటీ బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చారు.

విద్యార్థి సంఘాల బంద్ నేపథ్యంలో విద్యార్థి సంఘాలకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. రాజకీయ పార్టీలకు అనుబంధంగా పనిచేయవద్దని.. అనవసరంగా ర్యాలీలు, రాస్తారోకోలు, బందుల్లో పాల్గొని.. పోలీసు కేసులలో ఇరుక్కోవద్దని.. జీవితం నాశనం చేసుకోవద్దని సుద్దులు చెప్పారు. అయితే ఈ రోజు ఎస్వీ యూనివర్సిటీలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం జరుగనుంది. తమ క్యాంపస్‌లో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశానికి ఎలా అనుమతిస్తారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెచ్చగొట్టే పనులకు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పూనుకుంటోందని, పోలీసులు వారికి ఎలా అనుమతిస్తారని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed