ప్యాలెస్‌ పిల్లిని ఇంటికి పంపాలి... యువగళంలో Nara lokesh పిలుపు

by srinivas |
ప్యాలెస్‌ పిల్లిని ఇంటికి పంపాలి... యువగళంలో Nara lokesh పిలుపు
X

దిశ, తిరుపతి: తాను స్టూల్‌ ఎక్కితే చాలు పోలీసులు డ్రోన్‌ కెమెరాలు ఎగురవేస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ధ్వజమెత్తారు. వైసీపీ పాలనలో గ్రామాల్లో అభివృద్ధి శూన్యమని, అడుగడుగునా వైసీపీ మోసాలేనని ఆయన విమర్శించారు. యువగళం పాదయాత్రలో భాగంగా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కేఎంపురం గ్రామంలో ఆయన మైక్‌ లేకుండా ప్రసంగించారు. ఎక్కడ మైక్‌లో మాట్లాడతానో.. అడ్డుకుందామని పోలీసులు ఎదురుచూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు జగన్‌ వస్తారని.. ఇంటింటికీ కిలో బంగారం ఇస్తానని మాయమాటలు చెప్తాడని నమ్మొద్దని కోరారు. యువగళం ధర్మయుద్ధంలో వైసీపీపై పోరాడాలని.. ప్యాలెస్‌ పిల్లిని ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. మైక్ తీసేశాడని.. ప్రచారరథం లాగేసుకున్నా తాను భయపడనన్నారు. ప్రజల కోసం పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు లోకేష్‌.

అంతకుముందు యువగళం పాదయాత్రలో లోకేష్‌ను ఈడిగపల్లి గౌడ సామాజిక వర్గం నేతలు కలిశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు. గీత కార్మికులకు గుర్తింపు కార్డులు, పనిముట్లు, టీవీఎస్‌ ఎక్సెల్‌ వాహనాలు ఇవ్వాలని.. బీమా పాలసీ 20 లక్షలకు పెంచాలని.. కల్లుగీత సహకార సంఘానికి 5 ఎకరాల ప్రభుత్వ స్థలం ఇవ్వాలని విన్నవించారు. 45 ఏళ్లకే పెన్షన్లు.. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో గీత కార్మికులకు 50 శాతం ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని వినతిప్రతంలో పేర్కొన్నారు. తమ గ్రామంలో సీసీ రోడ్లు వేయించాలని కోరారు. గీత కార్మికుల పట్ల టీడీపీ చిత్తశుద్ధితో ఉందన్నారు లోకేష్‌. కల్లుగీత కార్మికులకు అన్ని విధాలా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. న్యాయబద్దమైన డిమాండ్లు అన్నింటినీ పరిశీలించి నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి రాగానే రోడ్లు నిర్మిస్తామని.. బీసీ కార్పొరేషన్‌ నుండి సబ్సిడీ లోన్లు అందించి ఆర్థిక సహకారాన్ని అందిస్తామన్నారు. పనిముట్లు అందిస్తామని హామీ ఇచ్చారు. మనందరి అంతిమ లక్ష్యం సైకో పోవాలి.. సైకిల్‌ రావాలి అని తెలిపారు.

Advertisement

Next Story