ఆపితే ఇక దండయాత్రే: Nara lokesh

by srinivas |   ( Updated:2023-02-17 11:15:53.0  )
ఆపితే ఇక దండయాత్రే: Nara lokesh
X

దిశ, డైనమిక్ బ్యూరో: యువగళం దెబ్బకు జగన్ రెడ్డికి జ్వరం వచ్చిందని, అందుకే తన పాదయాత్రపై ఆంక్షలు విధిస్తూ అడ్డుకుంటున్నాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. నిత్యం తన పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆయన విమర్శించారు. ఇందులో భాగంగానే పోలీసులకు బంపరాఫర్లు ఇస్తున్నారని తెలిపారు. శ్రీకాళహస్తిలో జరుగుతున్న యువగళం పాదయాత్రలో భాగంగా లోకేశ్ బహిరంగ సభలో మాట్లాడారు. పోలీసులు తన సౌండ్ వెహికల్ లాక్కుంటే అవార్డు...మైకు లాక్కుంటే రివార్డు...స్టూల్ లాక్కుంటే ప్రమోషన్ అని జగన్ రెడ్డి ఆఫర్లు పెట్టాడని ఎద్దేవా చేశారు. తన పాదయాత్ర ఆపడానికి 20మంది ఎస్ఐలు, 10 మంది సీఐలు, ఆరుగురు డీఎస్పీలు, వజ్ర వాహనం, టియర్ గ్యాస్, వందలాది ఇంటెలిజెన్స్ అధికారులను పెట్టారని మండిపడ్డారు.

లోకేశ్ పేరు చెబితే వైసీపీ నాయకులకు ఫ్యాంటులు తడిసిపోతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. చివరకు శ్రీకాళహస్తి ఆలయానికి కూడా వెళ్లొద్దని, పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్ప్పుడు, వైఎస్ఆర్, జగన్, షర్మిల పాదయాత్రలు చేస్తే పూర్తిగా సహకరించామని గుర్తు చేశారు. వీళ్ల ప్రభుత్వంలో తన మైకు లాక్కుంటున్నారని ధ్వజమెత్తారు. యువగళాన్ని సాగనిస్తే పాదయాత్ర...అడ్డుకుంటే దండయాత్రేనని లోకేశ్ హెచ్చరించారు.

Advertisement

Next Story