CPM: విద్యుత్ చార్జీల పెంపు మోయలేని భారం

by srinivas |
CPM: విద్యుత్ చార్జీల పెంపు మోయలేని భారం
X

దిశ, తిరుపతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై వేసిన విద్యుత్ భారాలు మోయలేని విధంగా తయారయ్యాయని సిపిఎం మాజీ ఎంపీ, పెనుమల్లి మధు అన్నారు. తిరుపతి సుందరయ్య నగర్‌లో ఆయన పర్యటించారు. ప్రభుత్వం పెంచిన కరెంటు బిల్లులపై ప్రజల అభిప్రాయాలను మధు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పి. మధు మాట్లాడుతూ ప్రతి ఇంటికి రూ. 300 నుండి రెండు వేల రూపాయల వరకు కరెంట్ బిల్లులు పెరిగాయని అన్నారు. ట్రూ అప్ చార్జీలు, కస్టమర్ చార్జీలు, ఫిక్స్‌డ్ చార్జీలు, స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలపై భారాలు మోయలేని విధంగా వేయడం తగదని అన్నారు. పెరిగిన ధరలతో ప్రజలు అల్లాడుతుంటే, దొంగ చాటున కరెంట్ ఛార్జీలు పెంచడం అన్యాయమన్నారు. వ్యవసాయ పంప్ సెట్‌లకు మీటర్లు బిగించి రైతులపై భారాలు మోపడమే కాకుండా, ఉచిత విద్యుత్తుకు మంగళం పాడుతున్నారని, తద్వారా రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా వినియోగదారులతో పెద్ద ఎత్తున ఆందోళనకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే వైసీపీ ప్రభుత్వం ఇంటికి పోవడం ఖాయమని అన్నారు.

ఈ సందర్భంగా సుందరయ్య నగర్ కాలనీవాసులు పలువురు తమ బిల్లులను తెచ్చి మధుకు చూపారు. లక్ష్మీదేవి అనే మహిళ మాట్లాడుతూ గతంలో తమకు రూ.300 బిల్లు వచ్చేదని గడచిన నెలలో రూ.2000కి చేరుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలోని పలువురు ప్రజలు ఐదు నెలలకు రావలసిన బిల్లు ఒక్క నెలకే వచ్చిందని, పెరిగిన తమ బిల్లులను ప్రదర్శిస్తూ మధుకి వివరించారు. పెరిగిన కరెంటు చార్జీలపై తిరగబడాలని మధు ప్రజలకు పిలుపునిచ్చారు. ఊరుకుంటే ధరలు తగ్గవని, తిరగబడి ఏలికలకు బుద్ధి చెప్పాలని కోరారు.

Advertisement

Next Story