Chittoor: జోగివారిపల్లెలో ఏనుగుల గుంపు హల్ చల్..హడలిపోతున్న జనం

by srinivas |
Chittoor: జోగివారిపల్లెలో ఏనుగుల గుంపు హల్ చల్..హడలిపోతున్న జనం
X

దిశ, వెబ్ డెస్క్: చుట్టూ అటవీ ప్రాంతం.. మంచి ఆహ్లాదకరమైన వాతావరణం. ఎంతో ప్రశాంతమైన పల్లె జీవనం. ఇలా ఉన్న ఆ గ్రామంలో ఏనుగులు అలజడి రేపాయి. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా పదికి పైగా ఏనుగులు గుంపులు, గుంపులుగా తిరుగుతున్నాయి. మంచి నీళ్ల కోసం అరణ్యాన్ని వదిలి జనారణ్యంలోకి వస్తున్నాయి. దీంతో స్థానిక గ్రామాల ప్రజలు హడలిపోతున్నారు. ఏనుగులు ఎప్పుడు దాడి చేస్తాయోనని ఆందోళన చెందుతున్నారు.

ఈ ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. 10 ఏనుగులకు పైగా జోగివారిపల్లె సమీపంలో సంచరించాయి. స్థానిక అటవీప్రాంతం నుంచి గ్రామాల్లోకి వచ్చాయి. అంతేకాదు స్థానికంగా కాలువ వద్ద నీళ్లలోకి దిగి స్నానం చేశాయి. ఘీంకారాలు చేస్తూ అక్కడే తిష్ట వేశాయి. దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఏనుగు ఎప్పుడు ఎటు నుంచి దాడి చేస్తాయోనని హడలిపోతున్నారు. రైతులయితే ఇళ్ల నుంచి పొలాలకు వెళ్లాలంటే జంకిపోతున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి ఏనుగులు అటవీప్రాంతంలోకి పంపించాలని కోరుతున్నారు.

Advertisement

Next Story