Big Task: గట్టిగా మచ్చ.. ఎలాగైనా గెలవాలనే పట్టులో చంద్రబాబు

by srinivas |
Big Task: గట్టిగా మచ్చ.. ఎలాగైనా గెలవాలనే పట్టులో చంద్రబాబు
X

దిశ, తిరుపతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని గట్టి పట్టుదలగా ఉన్న సంగతి తెలిసిందే. గెలుపు కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు ఆయనను కలవరపెడుతోందట. ఎందుకంటే చిత్తూరు జిల్లాలో టీడీపీకి ఏ స్థాయిలో పట్టు ఉందనేది అంతుచిక్కని ప్రశ్నే. 14 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు ఉన్న ఈ జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ హవా గట్టిగా కనిపించింది. ఒక కుప్పం మినహా మిగిలిన అన్నీ నియోజికవర్గాల్లో వైసీపీ అభ్యర్థులే గెలుపొందారు. దీంతో సొంత జిల్లాలోనే టీడీపీని బలపరచడంలో చంద్రబాబు విఫలం అయ్యాడనే మచ్చ గట్టిగా వినిపిస్తూ వచ్చింది. అటు జగన్ విషయానికొస్తే తన సొంత జిల్లా కడపను వైసీపీ కంచుకోటగా మార్చారు. కానీ చంద్రబాబు మాత్రం ఆ స్థాయిలో చిత్తూరు జిల్లాను టీడీపీకి కంచుకోటగా మార్చడంలో విఫలం అయ్యాడనే చెప్పాలి. దాంతో ఈసారి ఎలాగైనా చిత్తూరు జిల్లా మొత్తంలో పసుపు జెండా ఎగిరే విధంగా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే జిల్లాలోని అన్నీ నియోజకవర్గాల్లో పార్టీ బలాబలహీనతలపై ఫోకస్ పెట్టారట. సరైన అభ్యర్థులను రంగంలోకి దించేందుకు బాబు వ్యూహాలు రచిస్తున్నారట. మిగిలిన నియోజకవర్గాల సంగతి అటుంచితే పుంగనూరు, చంద్రగిరి, నగరి వంటి జిల్లాల్లో.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆర్కే రోజా.. వంటి వారి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చిత్తూరు జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేయాలంటే వీరి నియోజకవర్గాలపై ఎక్కువగా దృష్టి సారించాల్సి ఉంటుంది. అయితే ఈసారి కుప్పంలో చంద్రబాబును ఓడించే విధంగా జగన్ గట్టి ప్రణాలికతో ఉన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ, వైసీపీ వ్యూహాలతో చిత్తూరు జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. ఇక టీడీపీ, వైసీపీ పార్టీలతో పాటు జనసేన ప్రభావం కూడా ఈసారి చిత్తూరు జిల్లాలో గట్టిగానే కనిపించే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే సొంత జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేయడం చంద్రబాబుకు ఒక పెద్ద టాస్కే. మరి అపార చాణక్యుడిగా పేరున్న చంద్రబాబు చిత్తూరు విషయంలో ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తాడో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed