డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 21 మందికి జరిమానా

by Jakkula Mamatha |
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 21 మందికి జరిమానా
X

దిశ ప్రతినిధి, చిత్తూరు:చిత్తూరు నగరంలో శుక్రవారం ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ రైడింగ్‌లో 21 మంది పై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి వారికి రూ. 2.10 లక్షలు జరిమానా విధించారు. జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు చిత్తూరు డీఎస్పీ టి.సాయినాథ్ ఆధ్వర్యంలో చిత్తూరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నిత్య బాబు వాహన తనిఖీ చేస్తున్న సమయంలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ 21 మంది పట్టుబడ్డారు. వారందరిని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో శనివారం ప్రవేశపెట్టగా జడ్జ్ ఉమా దేవి వాహనదారులకు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చొప్పున జరిమానా విధించారు. ఈ 10 నెలల వ్యవధిలో చిత్తూరు ట్రాఫిక్ పోలీసులు మద్యం సేవించి వాహనాలు నడిపిన 360 మందికి సుమారు 30.70 లక్షల రూపాయల అపరాధం విధించారు.

రోడ్డు భద్రత నియమాలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యతని, జిల్లా లోని ప్రతి ఒక్కరూ రోడ్డు నియమాలను తప్పక పాటించాలని లేదా భారీ జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నిత్య బాబు తెలిపారు. మద్యం తాగి వాహనం నడపడం అత్యంత ప్రమాదకరం, ఇది మీ ప్రాణాలకు, ఇతరుల ప్రాణాలకు ప్రమాదం కలిగిస్తుంది. మద్యం సేవించిన వ్యక్తి డ్రైవింగ్ చేయడం పై సెక్షన్ 185 క్రింద మొదటి సారి నేరం చేస్తే రూ. 10,000 జరిమానా, లేదా 6 నెలలు జైలు శిక్ష విధించవచ్చు, రెండోసారి నేరం చేస్తే రూ.15,000 లేదా 3 సం.ల జైలు శిక్ష, లేదా రెండును విధించవచ్చని తెలిపారు. వాహనం నడిపే సమయంలో వాహనదారులు రోడ్డు భద్రతా మరియు రహదారి నిబంధనలు తప్పక పాటించి ప్రమాదాలు, జరిమానాలు, శిక్షలకు గురి కాకుండా ఉండాలని ఇన్స్పెక్టర్ కోరారు.

Advertisement

Next Story