తనిఖీలు నిల్.. కలెక్షన్లు ఫుల్

by Sathputhe Rajesh |
తనిఖీలు నిల్.. కలెక్షన్లు ఫుల్
X

దిశ, ఏలూరు ప్రతినిధి: రాష్ట్ర కర్మాగారాల శాఖలో అవినీతి ఊడలు దిగాయి. ఆధారాలతో దొరికిన అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు.. వాటిని కాసులుగా మార్చుకుంటున్నారు. పత్రికల్లో వచ్చిన కథనాలను సైతం వారికి అనుకూలంగా మార్చుకుని లంచాలు దండుకుంటున్నారు. వీటన్నింటిని వెనుక ఉన్నతాధికారుల ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆరోపణలు వస్తే పైసలు వసూల్

ఇటీవల కాకినాడ జిల్లా ఉప ముఖ్య కర్మాగార తనిఖీ అధికారి రాధాకృష్ణ వద్ద తనిఖీ అధికారులుగా మురళీకృష్ణ, స్వాతి విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు నిబంధనలకు విరుద్ధంగా విధులు నిర్వర్తిస్తున్నారు. మార్చి 28న సామర్లకోట మండలం హుస్సేన్ పురంలో ఒక సాగో పరిశ్రమలో 22 ఏళ్ల దుర్గాప్రసాద్ అనే యువకుడు విద్యుదాఘాతానికి గురై అక్కడకక్కడే మృతి చెందాడు. ఆ విషయం బయటకు వచ్చినా సరే నేటికీ కర్మాగారంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

నిబంధనలకు విరుద్ధంగా..

ఏలేశ్వరం మండలం ఏఎంకే స్టోన్ క్రషర్ నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఎం సురేష్ కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీనిపై రాజమహేంద్రవరం విభాగానికి చెందిన అధికారి జీ స్వాతి విచారణ చేయకుండానే.. తనిఖీలు పూర్తయినట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో క్రషర్ యాజమాన్యంతో సదరు అధికారి లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది.

తూతూమంత్రపు చర్యలు

వాస్తవానికి ఏదైనా కర్మాగారం పై ఫిర్యాదు చేస్తే సిటిజన్ చాప్టర్ కింద వారం రోజుల్లో తనిఖీ చేపట్టి తదుపరి నివేదికను ఫిర్యాదుదారునికి పంపాలి. కానీ ఈ నిబంధనలను అధికారులు అమలు చేయడం లేదు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ఇదే తీరు కనపడుతోంది. గతేడాది నవంబర్‌లో దేవరపల్లి మండలం కొండగూడెం త్రివేణి గ్లాసెస్ కర్మాగారంలో జరిగిన ఓ ప్రమాదంలో కార్మికుడు మృతి చెందాడు. దీనిపై జిల్లా ఉప ముఖ్య కర్మాగారాల తనిఖీ అధికారి సాధారణ నోటీసుతో సరి పెట్టారు. కొంత కాలానికి ఆ నోటీసు కూడా వెనక్కి తీసుకున్నట్లు తెలిసింది. ఇప్పటికైనా ఈ శాఖ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీహరి జవహర్ లాల్ తమ శాఖలో అవినీతిపై దృష్టి సారించాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి.

Advertisement

Next Story