చంద్రబాబు అరెస్ట్ తట్టుకోలేక అభిమానుల హఠాన్మరణం: నిజంగా గుండె పగిలిందా అంటూ వైసీపీ ఎంపీ సెటైర్లు

by Seetharam |
చంద్రబాబు అరెస్ట్ తట్టుకోలేక అభిమానుల హఠాన్మరణం:   నిజంగా గుండె పగిలిందా అంటూ వైసీపీ ఎంపీ సెటైర్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను తట్టుకోలేక పార్టీ కార్యకర్తలు గుండెపోటుతో చనిపోయిన సంగతి తెలిసిందే. మరికొందరు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 33 మంది చనిపోయారని టీడీపీ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సంఖ్య పెరగొచ్చని కూడా తెలుస్తోంది. అయితే ఆ మరణాలపై వైసీసీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజంగా వారి గుండె పగిలిందా? అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. పాదయాత్ర అనేది ఎవరైనా చేయొచ్చు. ఓదార్పు దేనికి? ఎవరిని ఓదారుస్తారు? చంద్రబాబు అరెస్టు తర్వాత ఎంత మంది చనిపోయారు? అని ప్రశ్నించారు. ఆయన అరెస్టు తర్వాత చనిపోయిన వారంతా.. గుండె పగిలి చనిపోయారని మీరు చెబితే.. నా దగ్గర సమాధానం లేదు అని అన్నారు. ఆనాడు మహానేత వైఎస్ఆర్ హెలికాప్టర్‌ ప్రమాదంలో చనిపోతే.. చాలా మంది గుండె పగిలి చనిపోయారు. అదే ఈరోజు చంద్రబాబు అరెస్టుతోనే నిజంగా ఎవరైనా చనిపోయారా? అనేది మీకే తెలుసు అంటూ మీడియా మీద నెట్టేశారు. మరోవైపు చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘అవినీతి చేసిన వారి మీద, అన్ని ఆధారాలు దొరికిన తర్వాత కేసులు పెట్టడం చట్టబద్ధమైన చర్య. ఆధారాలు లేకపోతే కోర్టులు కేసుల కొట్టేస్తాయి. ఇక్కడ అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టే.. అరెస్టు జరిగింది అని చెప్పుకొచ్చారు. చంద్రబాబుకి దాదాపు 6 లక్షల కోట్ల ఆస్తి ఉంది. వివిధ దేశాల్లో సింగపూర్, మలేషియా, లక్సెంబర్గ్‌ వరకు ఆయన ఆస్తులు కూడబెట్టుకున్నాడు. తన 14 ఏళ్ల పాలనలో ఎంత అవినీతికి పాల్పడ్డాడు? ఎంత సొమ్ము విదేశాల్లో దాచుకున్నాడు? అనేది బయటకు తీయాలి’ అని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement

Next Story