చంద్రబాబు భావోద్వేగం: కుటుంబ సభ్యులను చూసి కన్నీటిపర్యంతం

by Seetharam |
చంద్రబాబు భావోద్వేగం: కుటుంబ సభ్యులను చూసి కన్నీటిపర్యంతం
X

దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. ఉండవల్లిలోని ఇంటికి చేరుకున్న సమయంలో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. స్కిల్ స్కాం కేసులో అక్రమంగా ఇరికించారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు కుటుంబసభ్యులు చంద్రబాబును ఆలింగనం చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు. దీంతో చంద్రబాబు నాయుడు సైతం ఒకింత భావోద్వేగానికి గురై కంటతడిపెట్టారు. వెంటనే చేరుకుని కుటుంబ సభ్యులు, బంధువులకు చంద్రబాబు ధైర్యం చెప్పారు. అంతా మంచే జరుగుతుందని, ధైర్యంగా ఉండాలని చంద్రబాబు నాయుడు సూచించారు. స్కిల్ స్కాం కేసులో మధ్యంతర బెయిల్ రావడంతో చంద్రబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి ఇంటికి చేరుకున్నారు. తొలుత ఇంటికి చేరుకున్న అనంతరం సతీమణి భువనేశ్వరితో కలిసి చంద్రబాబు పూజలు చేశారు. ఈ మేరకు ఫొటోలను టీడీపీ సోషల్‌ మీడియా ఖాతాల్లో షేర్‌ చేసింది.

సుదీర్ఘ ప్రయాణం

ఇకపోతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో 52 రోజులపాటు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే అనారోగ్య కారణాల రీత్యా హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ఈ మేరకు నాలుగు వారాలపాటు కండీషన్స్‌తో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో మంగళవారం సాయంత్రం రాజమహేంద్రవరం జైలు నుంచి చంద్రబాబు విడుదలయ్యారు. రోడ్డుమార్గంలో సుమారు 13 గంటల పాటు ఆయన ప్రయాణించి ఉండవల్లిలోని నివాసానికి చేరుకున్నారు. మార్గమధ్యంలో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు చంద్రబాబుకు ఘనస్వాగతం పలికిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed