చంద్రబాబు బెయిల్ పిటిషన్ వాయిదా

by Seetharam |   ( Updated:2023-10-12 06:15:01.0  )
చంద్రబాబు బెయిల్ పిటిషన్ వాయిదా
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఈనెల 17కు విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. స్కిల్ డవలప్‌మెంట్ స్కాం కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు నాయుడు హైకోర్టును ఆశ్రయించారు. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టేయడంతో దాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. ఏపీ హైకోర్టులో గురువారం వాదనలు జరిగాయి. చంద్రబాబు నాయుడు తరఫున సీనియర్ న్యాయవాదులు దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించగా ఏపీ సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం వాదనలు వినించారు. ఈ స్కిల్ స్కాం కేసులో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. బెయిల్ ఇవ్వాలని కోరారు. కేసు విచారణకు తాను సహకరిస్తానని...నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు. ఇరువాదనలు విన్న ధర్మాసనం ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 17కి హైకోర్టు వాయిదా వేసింది.

గడువు కోరిన సీఐడీ

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విజయవాడ ఏసీబీ కోర్టు సుదీర్ఘ వాదనల విన్నదని తెలిపారు. అనంతరం బెయిల్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించిందని చంద్రబాబు తరపు లాయర్లు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో చంద్రబాబు ఏ37గా ఉన్నారని... కేసు దర్యాప్తులో భాగంగా రెండు రోజుల సీఐడీ కస్టడీలో చంద్రబాబు ఉన్నారని న్యాయవాదులు తెలిపారు. స్కిల్ కేసులో ఇతర నిందితులంతా ముందస్తు బెయిల్, బెయిల్ పై బయట ఉంటే చంద్రబాబు నాయుడు మాత్రమే రిమాండ్‌లో ఉన్నారని వాదించారు. స్కిల్ స్కాం కేసునకు సంబంధించి దర్యాప్తు పూర్తి అయ్యిదని అలాగే చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ సైతం 30 రోజులు దాటిపోయిన కారణంగా బెయిల్ ఇవ్వాలని కోరారు. అయితే ఈ అంశంపై తాము ఇన్ స్ట్రక్షన్స్ తీసుకోవాల్సి ఉందని సీఐడీ తరఫు న్యాయవాది ఏజీ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం అన్నారు. తాము కౌంటర్ దాఖలు చేస్తామని అందుకు కొంత సమయం గడువు కావాలని కోరారు. దీంతో హైకోర్టు ఈనెల 17 వరకు గడువు ఇచ్చింది. అప్పటి వరకు తదుపరి విచారణను వాయిదా వేసింది.

Advertisement

Next Story