50 లక్షల ఓట్లపై సందేహాలు.. నేడు సీఈసీతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ

by GSrikanth |
50 లక్షల ఓట్లపై సందేహాలు.. నేడు సీఈసీతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ
X

ఓటరు జాబితాలో విపక్షాలకు చెందిన ఓట్లు తొలగించారని ప్రధాన ప్రతిపక్షాలు ఎప్పటినుంచో మొత్తుకుంటున్నాయి. సుమారు 50 లక్షల ఓట్లపై పలు సందేహాలను వ్యక్తం చేస్తున్నాయి. ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా నామ్​కే వాస్తే చర్యలకు మాత్రమే పరిమితమయ్యారని ఆరోపిస్తున్నాయి. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. నేటి నుంచి మూడు రోజులపాటు ఓటరు జాబితాపై విచారణ జరపాలని నిర్ణయించింది. విజయవాడకు చేరుకున్న సీఈసీ బృందాన్ని ప్రతిపక్షనేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ మంగళవారం కలవనున్నారు.

దిశ, ఏపీ బ్యూరో: గత ఎన్నికల్లో టీడీపీ గెలిచిన స్థానాల్లో ఎంత మెజార్టీ వచ్చిందో అదే స్థాయిలో ఆ పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగించారనేది ప్రధాన అభియోగం. అలాగే ఒకే డోర్ నంబరుతో వందల సంఖ్యలో ఓట్లు నమోదయ్యాయి. వీటిపై సమగ్రంగా విచారణ జరగలేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఉన్నతాధికారులకు వివరాలు అందజేసినా తూతూమంత్రంగా చర్యలు తీసుకొని ఉదాసీనంగా వ్యవహరించినట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి పలుమార్లు ఫిర్యాదు చేశాయి. నిబంధనలకు విరుద్ధంగా ఫాం 7 ఇచ్చిన వారిపై పూర్తి స్థాయిలో రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోలేకపోయిందని విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రతి కుటుంబాన్ని జల్లెడ

సచివాలయ ఉద్యోగులను అడ్డం పెట్టుకొని ఓటరు జాబితాలో అధికార వైసీపీ అనేక అవకతవకలకు పాల్పడినట్లు టీడీపీ, ఇతర పక్షాలు ఫిర్యాదు చేశాయి. వలంటీర్ల ద్వారా ప్రతీ కుటుంబాన్ని జల్లెడ పట్టారు.. ఎవరు ఏ పార్టీకి సానుభూతిపరులనే వివరాలు సేకరించి ఓట్లను తొలగించినట్లు ఆరోపిస్తున్నాయి. అందువల్ల సచివాలయ, వలంటీర్లను పక్కన పెట్టి ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో ఓటరు జాబితాలో సవరణలు చేపట్టాలని డిమాండ్​చేస్తున్నాయి. అధికార పార్టీ ఏ నియోజకవర్గంలో ఎలాంటి అక్రమాలకు పాల్పడిందనే వివరాలను సీఈసీ బృందానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ నివేదించనున్నారు. బాబు, పవన్ ఇచ్చే నివేదికపై సీఈసీ సమగ్ర విచారణ చేపడుతుందా? సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లను పక్కన పెట్టి ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో ఓటరు జాబితాను రూపొందిస్తారా? అనేది సర్వత్రా చర్చనీయాంశమైంది.

గందరగోళం లేకుండా సవరణలు: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్​ కుమార్‌ మీనా

ఓటరు జాబితాలో ఎలాంటి గందరగోళం లేకుండా సవరణలు చేపట్టినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్​ముఖేష్ కుమార్ మీనా సోమవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. గతేడాది డిసెంబర్‌ 9 వరకు వచ్చిన దరఖాస్తులను పరిష్కరించినట్లు వెల్లడించారు. ఆ తర్వాత వచ్చిన దరఖాస్తులను జనవరి 12లోపు పరిష్కరిస్తామని చెప్పారు. మృతి చెందిన ఓటర్లు, డూప్లికేట్ కేసులు, ఓటు బదిలీ దరఖాస్తులను ఇంటింటి సర్వే నిర్వహించినట్లు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో 5,64,819 పేర్లను అనర్హులుగా తేల్చామన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేస్తున్నారన్న ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు.

కాకినాడలో ఫాం 7 ద్వారా గంపగుత్తగా ఓటర్లను తొలగిస్తున్న 13 మంది, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో దురుద్దేశ పూర్వకంగా దాఖలు చేసిన ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పేర్కొన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఐపీసీ, ఐటీ చట్టాల కింద కేసులు పెట్టామన్నారు. అక్కడ ఉల్లంఘనలకు పాల్పడిన 24 మంది బీఎల్‌వోలపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పర్చూరులో 10 ఎఫ్ఐఆర్‌లను నమోదు చేసినట్లు గుర్తు చేశారు. జీరో డోర్ నంబర్లు, ఒకే ఇంట్లో 10 మంది కంటే ఎక్కువ ఓటర్లున్న కేసుల్లో 97 శాతం మేర తనిఖీలు పూర్తి చేసి ఓటర్ల జాబితాను సవరించినట్లు చెప్పారు. ఒకే కుటుంబంలోని ఓటర్లు వేర్వేరు పోలింగ్ కేంద్రాలకు మారిపోయిన ఘటనలు విశాఖ, ఎన్టీఆర్ జిల్లాల్లో నమోదయ్యాయని ముఖేష్ కుమార్‌ మీనా వివరించారు.

Advertisement

Next Story

Most Viewed