యామినీ కృష్ణమూర్తి మృతిపట్ల చంద్రబాబు, జగన్ సంతాపం

by Gantepaka Srikanth |
యామినీ కృష్ణమూర్తి మృతిపట్ల చంద్రబాబు, జగన్ సంతాపం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ క్లాసికల్ డాన్సర్ యామినీ కృష్ణమూర్తి(84) మరణంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం తెలిపారు. దేశం గర్వించదగ్గ నృత్యకారిణి ఇక లేరని తెలిసి తీవ్రమైన ఆవేదన చెందాను అని చంద్రబాబు పేర్కొన్నారు. మదనపల్లెలో జన్మించిన ఆమె.. తిరుమల తిరుపతి దేవస్థాన(టీటీడీ) ఆస్థాన నర్తకిగా పనిచేశారని గుర్తుచేశారు. భరత నాట్యం, కూచిపూడి, ఒడిస్సి నృత్యాలలో నిష్ణాతురాలు అని కొనియాడారు. కూచిపూడి డాన్స్‌తో దేశ విదేశాలలో ఎనలేని పేరు తెచ్చిపెట్టారని అన్నారు.

ఆమె లేని లోటు నృత్య కళారంగంలో ఎవరూ తీర్చలేరని సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా చంద్రబాబు సంతాపం ప్రకటించారు. కాగా, వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యల కారణంగా గత కొంతకాలంగా బాధపడుతున్న ఆమె.. ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో 7 నెలల నుంచి ఐసీయూలోనే ఉన్నారు. ఈ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం తుదిశ్వాస విడిచారు. మరోవైపు నృత్య రంగంలో అద్భుతమైన ప్రతిభ కనబర్చిన యామినీ కృష్ణమూర్తి ఇక లేరు అని తెలిసి దిగ్ర్భాంతికి గురైనట్లు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సంతాపం ప్రకటించారు. ఆమె లేని లోటు ఎవరూ తీర్చలేరని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed