రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు

by Prasanna |   ( Updated:2023-09-13 04:02:41.0  )
రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు
X

దిశ, ఉభయ గోదావరి ప్రతినిధి: ఉమ్మడి గోదావరి జిల్లాలు ఒక్కసారిగా వేడెక్కాయి. చంద్రబాబును అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకురావడంతో రాష్ట్ర రాజకీయాలన్నీ రాజమండ్రి చుట్టూ తిరుగుతున్నాయి. పార్టీ కేడర్ సెంట్రల్ జైలు ఆవరణలో చెట్ల కింద, పుట్టలు కింద కూర్చొని నిరీక్షిస్తున్నారు. అంతేగాక టీడీపీని ఇరకాటంలో పెట్టి ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు జగన్ ప్రణాళిక రచించారని పుకార్లు కూడా షికార్లు చేస్తున్నాయి. చాలా చోట్ల ఈవీఎంలు సిద్ధమయ్యాయి. దీనికి తోడు హుటాహుటిన సినీనటుడు బాలకృష్ణ పార్టీ కేడర్ తో సమావేశం నిర్వహించడం.. పార్టీకి తాత్కాలికంగా అధ్యక్ష పదవి చేపడతారనే ప్రచారం సాగుతోంది. దీంతో గోదావరి జిల్లాలో రాజీకీయ కాక పెరిగింది.

ధర్నాలు, అరెస్టులతో హోరు..

ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రెండో రోజు కూడా ధర్నాలు, రాస్తా రోకోలు కొనసాగాయి. అనేక చోట్ల తెలుగుదేశం పార్టీ శ్రేణులను పోలీసులు అరెస్టు చేశారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో పార్టీ ఇన్చార్జి దాట్ల బుచ్చిబాబు నేతృత్వంలో రెండో రోజు కూడా బంద్ కొనసాగింది. కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ పలు చోట్ల ధర్నాలో పాల్గొన్నారు. మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప రాస్తారోకో నిర్వహించారు. అమలాపురంలో అయితాబత్తుల ఆనందరావు ధర్నా చేశారు. పిఠాపురంలో మాజీ శాసన సభ్యుడు వర్మ రాస్తారోకో చేపట్టారు. అనేక మంది పార్టీ సీనియర్లు రాజమండ్రి సెంట్ర్లల్ జైలు వద్ద నీరిక్షించారు. మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు రాజమండ్రి వెళ్లి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణిలను కలిసి వారికి ధైర్యం చెప్పారు.

ముందస్తు ఎన్నికలంటూ ప్రచారం

ముందస్తు ఎన్నికలు జరగనున్నాయంటూ ప్రచారం సాగుతోంది. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో పార్టీని ఇరకాటంలో పెట్టి వైసీపీ ముందస్తుకు వెళుతుందని పుకార్లు వస్తున్నాయి. మరో వైపు ఓట్ల జాబితా తయారీలో ఎన్నికల కమిషన్ నిమగ్నమవడం, ఈవీఎంలు పరిశీలించడం వంటి అంశాలు ఈ పుకార్లకు బలం చేకూర్చుతున్నాయని రాజకీయ పండితులు అంటున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని సీఎం జగన్ చెప్పడం కూడా దీనికి బలం చేకూర్చుతోంది.

పార్టీ అధ్యక్ష పదవిపై ఊహాగానాలు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఇప్పట్లో బెయిల్ రావడం కష్టమని, త్వరలో మరిన్ని కేసుల విచారణను ఆయన ఎదుర్కోనున్నారని ప్రచారం సాగుతోంది. దీంతో సుదీర్ఘ కాలం జైలులో ఉంటే పార్టీ బలహీన పడే పరిస్థితి ఉంటుందని, అందుకే బాలకృష్ణ అధ్యక్ష పదవి చేపట్టే అవకాశం ఉందని ప్రజలకు చర్చించుకుంటున్నారు. తాజాగా చంద్రబాబు లేకపోవడంతో పార్టీ నేతలతో బాలకృష్ణ సమావేశం నిర్వహించడం దీనికి మరింత బలం చేకూర్చుతుందని అంటున్నారు. అయితే భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed