ఏపీ పాలిటిక్స్‌లో ఇంట్రెస్టింగ్ సీన్.. మాజీ CM జగన్‌కు చంద్రబాబు ఫోన్..!

by Satheesh |   ( Updated:2024-06-11 15:51:40.0  )
ఏపీ పాలిటిక్స్‌లో ఇంట్రెస్టింగ్ సీన్.. మాజీ CM జగన్‌కు చంద్రబాబు ఫోన్..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి సమయం ఆసన్నమైంది. బుధవారం 11.27 నిమిషాలకు నాలుగో సారి ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు అమిత్ షా, బండి సంజయ్, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, స్టార్ హీరోలు చిరంజీవి, రజినీకాంత్‌లు హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే తన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ను ఆహ్వానించేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. ఈ మేరకు మంగళవారం జగన్‌కు చంద్రబాబు ఫోన్ చేశారు. తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించడానికి ట్రై చేశారు. అయితే, చంద్రబాబు ఫోన్‌కు జగన్ అందుబాటులోకి రాలేదని సమాచారం.

దీంతో చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి జగన్ హాజరు కావడం లేదని తెలుస్తోంది. కాగా, ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 175 అసెంబ్లీ స్థానాలకు గానూ ఏకంగా 164 సీట్లలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. అధికార వైసీపీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమై ఘోర ఓటమిని మూటగట్టుకుంది. వైసీపీ దారుణంగా ఓడిపోవడంతో జగన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీఏ కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారు. దీంతో చంద్రబాబు మరోసారి ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

Advertisement

Next Story