నారా భువనేశ్వరి వల్లే చంద్రబాబు, లోకేశ్‌లు నాశనమయ్యారు : పోసాని కృష్ణ మురళి

by Seetharam |   ( Updated:2023-10-02 09:48:52.0  )
నారా భువనేశ్వరి వల్లే చంద్రబాబు, లోకేశ్‌లు నాశనమయ్యారు : పోసాని కృష్ణ మురళి
X

దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌లు నాశనం అవ్వడానికి ప్రధాన కారణం నారా భువనేశ్వరియేయనని ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్ పోసాని కృష్ణముళి సంచలన వ్యాఖ్యలు చేశారు. భార్యమాట విని చంద్రబాబు, తల్లి మాట విని లోకేశ్ నాశనమయ్యారన్నారు. హైదరాబాద్‌లో సోమవారం పోసాని కృష్ణమురళి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయిన తర్వాత నారా భువనేశ్వరి, బ్రాహ్మణి‌లు చేస్తున్న వ్యాఖ్యలు సరికాదన్నారు. భర్తలను మించిన రాజకీయ నాయకురాలు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అత్తా కోడళ్ళు ఇద్దరూ భర్తల కంటే పెద్ద రాజకీయ నాయకురాళ్లని ఎద్దేవా చేశారు. భర్తలను తిట్టారనే విషయం మర్చిపోయిన భువనేశ్వరి, బ్రాహ్మణిలు వచ్చే ఎన్నికల్లో పవన్ మద్దతు కోరారంటూ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడుకు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ భిక్ష పెట్టిందని గుర్తు చేశారు. భువనేశ్వరి కోసం ఎన్టీఆర్‌ చంద్రబాబును పార్టీలో చేర్చుకున్నారని ఇందుకు పార్టీ సీనియర్ నేతలను సైతం ఒప్పించారని గుర్తు చేశారు. అంత సాహసం చేసిన పార్టీలోకి తీసుకువచ్చిన తండ్రిపై చంద్రబాబు చెప్పులు వేయిస్తే భువనేశ్వరి చూస్తూ ఊరుకున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవిని, పార్టీ పగ్గాలను చంద్రబాబు లాక్కున్నా కనీసం ఖండించలేదన్నారు. ఈ విషయంలో భువనేశ్వరిది చాలా పెద్ద తప్పు అని పోసాని కృష్ణ మురళి అన్నారు.

ఏపీకి ఇద్దరు గాంధీలు

వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను నీ భర్త చంద్రబాబు నాయుడు కొనుగోలు చేసినప్పుడు సత్యమేవ జయతే ఎక్కడ పోయింది? సత్యమేవ జయతే కాదు. అసత్యమేవ అజయతే అని బోర్డు పెట్టుకోవాలి అంటూ ఘాటు విమర్శలు చేశారు. హెరిటేజ్ పెట్టింది మా సినిమా లెజెండ్...కానీ ఇప్పుడు నారావారి అధీనంలో ఉందని ఆరోపించారు. పాలిటిక్స్ అంటే డబ్బులు సంపాదించుకోవచ్చు అనే యావలో చంద్రబాబు ఉండేవారన్నారు. జయప్రద లాంటి వాళ్ళు ప్రజాసేవ కోసం వస్తే వాళ్ళ జీవితాలను నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ పోసాని కృష్ణమురళీ ధ్వజమెత్తారు. చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తే మంచి లేదంటే అక్రమ కేసులా? అని విరుచుకుపడ్డారు. భారతదేశానికి ఒకరే గాంధీ. కానీ ఏపీకి మాత్రం ఇద్దరు గాంధీలు ఉన్నారని.. ఒకరు చంద్రబాబు అయితే మరోకరు నారా లోకేశ్ అంటూ పోసాని కృష్ణమురళీ సెటైర్లు వేశారు.

పవన్ ఆరోపణలు గుర్తులేవా భువనేశ్వరి,బ్రాహ్మణి

టీడీపీ హయాంలో చంద్రబాబు, లోకేశ్‌‌లు భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించింది గుర్తులేదా అని భువనేశ్వరిని, నారా బ్రాహ్మణిని పోసాని కృష్ణమురళి ప్రశ్నించారు. అక్రమాలతోపాటు అనేక మోసాలకు పాల్పడుతున్నారని పవన్ కల్యాణే లెక్కలు కూడా చెప్పారని గుర్తు చేశారు. అలాంటి ఆరోపణలు చేసిన పవన్ కల్యాణ్ నేడు చంద్రబాబు నాయుడును మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పడంలో మంత్రాంగం ఏంటో అర్థం కావవడం లేదన్నారు. చంద్రబాబు, లోకేశ్‌లను పవన్ కల్యాణ్ విమర్శించిన విషయం భువనేశ్వరి, బ్రాహ్మణిలకు తెలియదా అని ప్రశ్నించారు. అన్నీ తెలిసి కూడా పవన్ కల్యాణ్‌ను పక్కన కూర్చోబెట్టి టీ, కాఫీలు ఇస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ అమాయకుడు కాబట్టే భువనేశ్వరి, బ్రాహ్మణిలు జ్యూస్‌ ఇవ్వగానే టీడీపీకి మద్దతు ప్రకటించారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌ను ఒంటరి వాడిని చేసి, ఆయన్ను మోసం చేసి చావడానికి కారణం అయిన వాళ్లు దండం పెట్టగానే పవన్ కల్యాణ్ అభయం ఇచ్చేశాడంటూ పోసాని కృష్ణమురళీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పవన్ ఒంటరిగా పోటీ చేయ్

పవన్‌ కల్యాణ్‌కు వ్యక్తిత్వం ఉంటే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి గెలుపొందాలని పోసాని కృష్ణమురళి డిమాండ్ చేశారు. సీఎం జగన్‌ వ్యక్తిత్వం ఉన్న నాయకుడు కాబట్టే ఒంటరిగా పోటీ చేస్తాడని చెప్పుకొచ్చారు. వైఎస్ జగన్‌కు కులం, మతం లేదన్నారు. ఇప్పటికైనా పవన్ కల్యాణ్ వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పడం మానేసి తనకు ఎన్ని సీట్లు వస్తాయో.. తనను గెలిపిస్తే ప్రజలకు ఏం చేస్తానో వివరిస్తే మంచిదని సూచించారు. పవన్‌ కల్యాణ్ కనీసం కాపులకు అండగా ఉంటానని కూడా ఇప్పటి వరకు ఎలాంటి హామీ కూడా ఇవ్వలేదన్నారు. పవన్ కల్యాణ్ మైకంలోకి కాపులు వెళ్లొద్దని సూచించారు. ఎవరు మంచి అభివృద్ధి చేస్తే వాళ్ళను గెలిపించాలని... ఇప్పటికే చాలాసార్లు నష్టపోయారని ఇక నష్టపోవద్దని కాపులకు పోసాని కృష్ణమురళి సూచించారు.

Advertisement

Next Story