సీఎం జగన్ ఎక్కడ అడుగు పెడితే అక్కడే అరిష్టమే: బుద్దా వెంకన్న ఫైర్

by Satheesh |   ( Updated:2023-05-07 13:24:41.0  )
సీఎం జగన్ ఎక్కడ అడుగు పెడితే అక్కడే అరిష్టమే: బుద్దా వెంకన్న ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈనెల ఉమ్మడి విశాఖలో చంద్రబాబు పర్యటించనున్నట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న వెల్లడించారు. ఈనెల 17, 18, 19 తేదీల్లో పెందుర్తి, ఎస్.కోట, అనకాపల్లి నియోజకవర్గాల్లో ‘ఇదేం ఖర్మ-మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ అక్రమాలపై ఉత్తరాంధ్ర నుంచే తిరుగుబాటు మొదలవ్వాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రిది దరిద్రగొట్టు పాదం అని.. ఎక్కడ అడుగు పెడితే అక్కడే అరిస్టమే అంటూ బుద్ధా వెంకన్న ధ్వజమెత్తారు. పంటకు చీడపడితే ఎంత నష్టం జరుగుతుందో రాష్ట్రం ఇప్పుడు అదే స్థితికి వచ్చిందని చెప్పుకొచ్చారు. వైఎస్ జగన్ అడుగు పెట్టిన వెంటనే కరోనా మహమ్మారి వచ్చిందని.. కాలాలు కూడా గతి తప్పి వ్యతిరేకంగా పని చేస్తున్నాయని ధ్వజమెత్తారు.

‘అమరావతిలో అడుగు పెట్టారు.. విజయవాడ, గుంటూరు నాశనం అయ్యాయి. సెప్టెంబర్ నుంచి సీఎం వైజాగ్‌లో కాపురం పెడితే నాశనమే. ఈ ముఖ్యమంత్రిని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలి. ఎన్నికల్లో పొత్తుపై చంద్రబాబు తుది నిర్ణయం తీసుకుంటారు. సీఎం వస్తోంది విశాఖ నుంచి ఇచ్చాపురం వరకు భూ ఆక్రమణల కోసమే’ అని బుద్ధా వెంకన్న ధ్వజమెత్తారు. విజయవాడను పెద్ద పల్లెటూరుగా మార్చేశారని విరుచుకుపడ్డారు. డీఎస్పీల నియామకాల్లో రాజకీయ జోక్యం వెనుక మాఫియా ఆలోచనలు ఉన్నాయని మండిపడ్డారు. రైతుల సమస్యలపై ప్రతిపక్ష నాయకుడు రోడ్లపై తిరుగుతుంటే సీఎం ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలిగిన సీనియర్ మంత్రి బాధ వర్ణనాతీతంగా ఉందని బుద్దా వెంకన్న కీలక వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story