Daggubati Purandeswari : కొత్త టీమ్‌పై దగ్గుబాటి పురంధేశ్వరి ఫోకస్..జగన్‌పై ఇక యుద్ధమేనా?

by Seetharam |   ( Updated:2023-07-18 08:11:48.0  )
Daggubati Purandeswari : కొత్త టీమ్‌పై దగ్గుబాటి పురంధేశ్వరి ఫోకస్..జగన్‌పై ఇక యుద్ధమేనా?
X

దిశ, డైనమిక్ బ్యూరో : కమలదళం రథసారథిగా బాధ్యతలు చేపట్టిన దగ్గుబాటి పురంధేశ్వరి పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారా? బీజేపీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టనున్నారా? పార్టీలో సంస్థాగత మార్పులు చేయాలని బీజేపీ అగ్రనాయకత్వం ఆదేశించిందా? వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కొత్త టీమ్‌ను ఏర్పాటు చేయాలని హైకమాండ్ ఆదేశించిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవలే ఏపీ బీజేపీ పగ్గాలు చేపట్టిన దగ్గుబాటి పురంధేశ్వరి ఇక విశ్రమించకూడదని నిర్ణయించుకున్నారు. ఏపీలో బీజేపీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే బీజేపీ పదాధికారుల సమావేశంలో పార్టీ సంస్థాగత మార్పులపై కూడా హింట్ ఇచ్చేశారు. తొలుత పార్టీకి సంబంధించిన కీలక పదవుల్లో మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయించారు. పూర్తిగా తన టీమ్‌ను ఏర్పాటు చేసుకునే పనిలో చిన్నమ్మ బిజీబిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త టీమ్ ఏర్పడిన తర్వాత విస్తృతస్థాయిలో జిల్లాల్లో పర్యటించాలని దగ్గుబాటి పురంధేశ్వరి భావిస్తున్నారు. దీంతో దగ్గుబాటి పురంధేశ్వరి రాకపోతే కమలం వికసిస్తుందా అన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతుంది.

రాష్ట్ర కమిటీ ప్రక్షాళన

ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా ఎవరూ ఊహించని విధంగా దగ్గుబాటి పురంధేశ్వరి బాధ్యతలు చేపట్టారు. బీజేపీ జాతీయ కార్యవర్గంలో ఉన్న దగ్గుబాటి పురంధేశ్వరిని రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమిస్తారని ఎవరూ ఊహించలేదు. సీఎం రమేశ్ లేదా సత్యకుమార్ అంటూ ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా దగ్గుబాటి పురంధేశ్వరి పేరు తెరపైకి రావడంతో అంతా అవాక్కయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులైన తర్వాత పురంధేశ్వరి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తనకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేయడంతోపాటు బీజేపీ బలోపేతంపై చర్చించారు. అయితే పార్టీని బలోపేతం చేయాలని జేపీ నడ్డా ఆదేశించారు. అంతేకాదు పదవుల విషయంలో పూర్వ అధ్యక్షుల్లో విభేదాలు చోటు చేసుకున్నాయని ఈ పరిణామాలతో కొత్త టీమ్‌ను ఎంపిక చేసుకోవాలని వచ్చే ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనే టీంను రెడీ చేసుకోవాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. బీజేపీ హైకమాండ్ ఆదేశాలతో దగ్గుబాటి పురంధేశ్వరి పార్టీ పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే.

సమర్థులకే బాధ్యతలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టిన తర్వాత రాష్ట్ర కమిటీల్లో మార్పులు చేర్పులతోపాటు సంస్థాగత అంశాలపై దగ్గుబాటి పురంధేశ్వరి ఫోకస్ పెట్టారు. తనపై గురుతర బాధ్యతలు ఉన్నాయని దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. పార్టీని బలోపేతం చేయడం తన ఒక్కరి వల్లే సాధ్యం కాదన్న ఆమె ప్రతీ కార్యకర్త సహకారం అవసరం అని చెప్పుకొచ్చారు. క్షేత్ర స్థాయిలో పార్టీని ప్రజలకు చేరువ చేసేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీని బలోపేతం చేసుకునే దిశగా ముందు కసరత్తు చేయాలని అధినాయకత్వం సూచించిందని పురంధేశ్వరి చెప్పుకొచ్చారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉండటంతో అన్ని స్థాయిల్లోని కమిటీలను బలోపేతం చేసుకోవాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. పార్టీ కమిటీలలో మార్పులు చేర్పులు చేసి ఇక ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. అయితే గత బీజేపీ అధ్యక్షులుగా పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజులు కమిటీల నియామకాల్లో విభేదాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితి రాకుండా చిన్నమ్మ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో పార్టీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేవారికే పదవులు కేటాయించాలని పురంధేశ్వరి నిర్ణయించినట్లు తెలుస్తోంది.

క్యాడర్‌కు దిశానిర్దేశం

రాష్ట్రంలో ఎన్నికలకు నెలల వ్యవధి మాత్రమే ఉండటంతో దగ్గుబాటి పురంధేశ్వరి ప్రజల్లో ఉండేందుకు కార్యచరణ సైతం సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. ప్రజల వద్దకు ఏయే అంశాలతో వెళ్లాలి.. వారిని బీజేపీకి ఎలా ఆకర్షితులను చేయాలి అనే అంశాలపై పార్టీ క్యాడర్‌కు పురంధేశ్వరి దిశానిర్దేశం చేయనున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 23న ప్రొద్దుటూరులో రాయలసీమ నేతలతో పురంధేశ్వరి సమావేశం కానున్నారు. ఈ నెల 25న గుంటూరులో కోస్తా జిల్లాల నేతలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. అలాగే ఈ నెల 26న రాజమహేంద్రవరంలో గోదావరి జిల్లాల నేతలతో పురంధేశ్వరి భేటీ కానున్నారు. అనంతరం ఈ నెల 27న విశాఖలో ఉత్తరాంధ్ర నేతలతో బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి సమావేశం కానున్నారు. 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే ఎన్నికల సమరానికి శ్రేణులను సిద్ధం చేసేందుకు పురంధేశ్వరి దిశానిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Advertisement

Next Story