బీసీ మంత్రం.. ఉత్తరాంధ్రలో వైసీపీ బిగ్ స్కెచ్!

by Sathputhe Rajesh |   ( Updated:2023-11-14 03:54:17.0  )
బీసీ మంత్రం.. ఉత్తరాంధ్రలో వైసీపీ బిగ్ స్కెచ్!
X

ఈసారి ఎన్నికల్లో గట్టెక్కడానికి వైసీపీ అన్ని అస్త్రాలను సంధిస్తోంది. తాజాగా కొన్ని ప్రాంతాలకే పరిమితమైన బీసీ కులాలను రాష్ట్ర వ్యాప్త జాబితాలోకి చేరుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో వైఎస్సార్ 42 కులాలను కొన్ని ప్రాంతాలకు పరిమితం చేస్తూ బీసీల్లో చేర్చారు. రిజర్వేషన్ పెంచకుండా ఇలా చేర్చడమేంటని నాడు బీసీలు కినుక వహించారు. ఇప్పుడు ఆయా కులాలను రాష్ట్ర వాప్తంగా బీసీలుగా పరిగణించాలని సీఎం జగన్​నిర్ణయం తీసుకున్నారు. తద్వారా ఉత్తరాంధ్ర నుంచి కృష్ణా జిల్లా వరకు పార్టీకి మైలేజీ పెరుగుతుందని భావిస్తున్నారు. మరోవైపు మిగతా బీసీ కులాలు అసంతృప్తికి గురయ్యే అవకాశముందని కొన్ని బీసీ కులాల నుంచి వినిపిస్తోంది.

దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లోనే బీసీలుగా పరిగణిస్తున్న 21 వెనుకబడిన కులాలు, వాటి ఉప కులాలకు ఇప్పుడు భౌగోళిక పరిమితులను రద్దు చేస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులిచ్చింది. ప్రస్తుతం బీసీ జాబితాలో 138 కులాలున్నాయి. అందులో 31 కులాలకు భౌగోళిక పరిమితులున్నాయి. అందులో పది కులాలు తెలంగాణలో ఉన్నాయి. మిగిలిన 21 కులాలను కోస్తా, రాయలసీమలో బీసీలుగా పరిగణిస్తున్నారు. ఈ కులాలన్నింటకీ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలుగా గుర్తించాలని ప్రభుత్వానికి వినతులు అందాయి. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఒక్క శెట్టి బలిజలను మాత్రం రాయలసీమలో బీసీలుగా పరిగణించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది.

బీసీ ఏ గ్రూపులో 6 కులాలు

భౌగోళిక పరిమితులను రద్దు చేసిన వాటిల్లో బీసీ – ఏ గ్రూపులో 6 కులాలు, వాటి ఉప కులాలున్నాయి. కురకుల పొండర, సామంతుల, పాల ఏకరీ, ఏకిల, వ్యాకుల, ఏకిరి, నయనివారు, పాలెగారు, తొలగరి, కవలి, ఆసాదుల, కెవుట కులాలున్నాయి. బీసీ–బీ గ్రూపులో నాలుగు కులాలు, వాటి ఉప కులాలున్నాయి. అచ్చుకంట్లవాండ్లు, గౌడ (ఈడిగ, గవళ్ల) కలాలీ, గౌండ్ల, శెట్టి బలిజ (రాయలసీమ మినహా) కుంచిటి, వక్కలింగ, గుడ్ల కులాలున్నాయి. బీసీ – డీ గ్రూపులో 11 కులాలు, వాటి ఉపకులాలున్నాయి. వాటిల్లో మున్నూరు కాపు, పోలినాటి వెలమ, సదర, అరవ, అయ్యరక, నగరాలు, ముదలర్‌, ముదలియార్‌, బేరి వైశ్య, అతిరాస, కుర్మి, కళింగ కోమటి (కళింగ వైశ్య) కులాలున్నాయి.

రాజకీయ లబ్ధి కోసమేనా?

ఈ కులాలన్నీ ఎక్కువగా ఉత్తరాంధ్ర, ఉమ్మడి గోదావరి, కృష్ణా జిల్లాల్లో కనిపిస్తాయి. ఈ ప్రాంతాల్లో రాజకీయంగా లబ్ధి చేకూరుతుందనే ఎత్తుగడతో అధికార పార్టీ భౌగోళిక పరిమితులను రద్దు చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2008లో వైఎస్సార్ వివిధ ప్రాంతాలకు పరిమితం చేస్తూ 42 కులాలను బీసీల్లో చేర్చారు. రిజర్వేషన్ పెంచకుండా ఇలా రాజకీయ ప్రయోజనాల కోసం బీసీల్లో చేర్చడమేంటని అనేక వెనుకబడిన కులాల నుంచి నిరసన వ్యక్తమైంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలుగా గుర్తించే 21 కులాల జనాభా సంతృప్తి వ్యక్తం చేయొచ్చు. అసంతృప్తికి గురయ్యే కులాలు కూడా ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed

    null