బాపట్ల: లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన ఎస్ఐ

by Seetharam |
బాపట్ల: లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన ఎస్ఐ
X

దిశ, డైనమిక్ బ్యూరో : బాపట్ల జిల్లా చుండూరు పోలీస్ స్టేషన్‌పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించడం సంచలనంగా మారింది. చుండూరు ఎస్ఐ బోరుగడ్డ భరత్ కుమార్ రూ.45 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే బాపట్ల టౌన్ అబ్బారుపేట్‌కి చెందిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న బత్తుల గోవిందు పై చుండూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఆ కేసులో తనను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు, స్కార్పియో వాహనాన్ని సీజ్ చేయకుండా ఉండేందుకు ఎస్ఐ బోరుగడ్డ భరత్ కుమార్‌తో చర్చించారు. దీంతో ఎస్ఐ భరత్ కుమార్ రూ.75వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో తొలివిడతగా రూ.30,000 బత్తుల గోవింద్ ఎస్ఐ భరత్ కుమార్‌కు చెల్లించారు. అయితే మిగిలిన సొమ్ము కూడా ఇవ్వాలని డిమాండ్ చేయడంతో బాధితుడు బత్తుల గోవింద్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న అధికారులు గురువారం చుండూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ బోరుగడ్డ భరత్ కుమార్ ఆదేశాలు మేరకు ఆ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న దారా క్రాంతి కుమార్ రూ.45000/- బాధితుడి నుండి లంచం సొమ్ము తీసుకొని, స్టేషన్ రైటర్ గా వ్యవహరిస్తున్న పోలీసు కానిస్టేబుల్ గరికపాటి రవీంద్రకు అందజేశారు. ఆ లంచం సొమ్మును గుంటూరు రేంజ్ అవినీతి నిరోధక శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన అధికారులను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పరిచారు. అవినీతి నిరోధక శాఖ ప్రజల కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉంచిన 14400 నెంబరును ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని, ఎవరైనా అధికారులు వేధింపులకు పాల్పడితే ప్రజలు ఈ నెంబర్ ద్వారా అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించ వచ్చని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి సూచించారు.

Advertisement

Next Story

Most Viewed