CBI: అవసరమైతే అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేస్తాం.. హైకోర్టుకు తెలిపిన సీబీఐ

by srinivas |   ( Updated:2023-04-17 11:01:31.0  )
CBI: అవసరమైతే అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేస్తాం.. హైకోర్టుకు తెలిపిన సీబీఐ
X

దిశ, వెబ్ డెస్క్: కడప ఎంపీ అవినాశ్ రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై వాదనలు కొనసాగుతున్నాయి. విచారణకు వస్తే అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా అని సీబీఐను హైకోర్టు ప్రశ్నించింది. అయితే ఇందుకు సీబీఐ అవసరమైతే అరెస్ట్ చేస్తామని తెలిపింది. భాస్కర్ రెడ్డి పిటిషన్ హైకోర్టు విచారణలో ఉండగానే ఆయన్ను అరెస్ట్ ‌చేశారని అవినాశ్‌రెడ్డి తరపు లాయర్ వాదనలు వినిపించారు. భాస్కర్ రెడ్డి పిటిషన్‌పై ఎలాటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదని హైకోర్టు స్పష్టం చేసింది.

దస్తగిరిని సీబీఐ బెదిరించింది: అవినాశ్ రెడ్డి లాయర్

అయితే దస్తగిరిని సీబీఐ బెదిరించి చిత్ర హింసలకు గురి చేసిందని కోర్టుకు అవినాశ్ రెడ్డి లాయర్ తెలిపారు. సీబీఐకి భయపడి భాస్కర్‌రెడ్డి, అవినాశ్ రెడ్డిలకు వ్యతిరేకంగా దస్తగిరి సాక్ష్యం ఇచ్చాడని లాయర్ పేర్కొన్నారు. ఈ విషయం విచారణలో ఎర్ర గంగిరెడ్డి చెప్పారని అవినాశ్ రెడ్డి లాయర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అవినాశ్ రెడ్డి సహ నిందితుడని ప్రచారం జరుగుతోందని లాయర్ తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి అసలు హంతకులు ఎవరో తేల్చడం లేదని అవినాశ్ రెడ్డి తరపు లాయర్ చెప్పారు. రాజకీయ కోణంలో అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని కోర్టుకు లాయర్ తెలిపారు.

తెలంగాణ హైకోర్టులో అవినాశ్ రెడ్డి బెయిల్ పిటిషన్‌

కాగా వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్‌ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తన తండ్రిని అరెస్ట్ చేయడం అంతకుముందు ప్రధాన అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో అవినాశ్ రెడ్డి అరెస్ట్ తథ్యమంటూ వార్తలు హల్‌చల్ చేశాయి. దీంతో ముందస్తు బెయిల్ కోరుతూ అవినాశ్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్‌పై వైఎస్ వివేకానందరెడ్డి తనయ వైఎస్ సునీతారెడ్డి ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. తమ వాదనలు కూడా వినాలని తెలంగాణ హైకోర్టును కోరారు. మధ్యంతర బెయిల్ పిటిషన్‌లో ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి చేసిన ఆరోపణలపై తమ వాదనలు వినాలని విజ్ఞప్తి చేశారు.

కోర్టు తీర్పు ఎలా ఉండబోతోందో..?

ప్రస్తుతం ఎంపీ అవినాశ్ రెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్‌‌పై విచారణ జరుగుతోంది. అటు సీబీఐ , ఇటు అవినాశ్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. వాదనలు ముగిసిన తర్వాత కోర్టు ఏం ఆదేశాలిస్తుందో చూడాలి. ఇప్పటికే అవినాశ్ రెడ్డి అనుచరులు హైకోర్టు బయట భారీగా చేరుకున్నారు. కోర్టు తీర్పు ఎలా ఉండబోతోందోనని వారిలో ఉత్కంఠ కనిపిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed