బాలకృష్ణ! నీకు రోషం లేదా? తోకముడిచి పారిపోయావెందుకు?: మంత్రి ఆర్‌కే రోజా

by Seetharam |
బాలకృష్ణ! నీకు రోషం లేదా? తోకముడిచి పారిపోయావెందుకు?: మంత్రి ఆర్‌కే రోజా
X

దిశ, డైనమిక్ బ్యూరో : హిందూపురం ఎమ్మెల్యే, అగ్రనటుడు నందమూరి బాలకృష్ణపై మరోసారి మంత్రి ఆర్‌కే రోజా రెచ్చిపోయారు. అసెంబ్లీలో బాలకృష్ణ చిల్లర చేష్టలు చేస్తున్నారని మండిపడ్డారు. బాబు నిప్పు అని బాలకృష్ణ అసెంబ్లీలో చెప్పగలడా? అని మంత్రి ఆర్ కే రోజా సవాల్ విసిరారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద శుక్రవారం మంత్రి ఆర్‌కే రోజా మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును చూసి పాపం అనేవారు లేరు.. పాపాలు పండాయ్ అంటున్నారు అని చెప్పుకొచ్చారు. స్కిల్ స్కాంపై చర్చ అనగానే బాలకృష్ణ తోకముడిచి పారిపోయాడు అని మంత్రి రోజా విమర్శించారు. ‘చంద్రబాబు స్కిల్‌ డెవలెప్‌మెంట్‌ స్కాంలో రూ.371 కోట్ల అవినీతి చేశాడు. నిన్న తొడకొట్టిన బాలకృష్ణ ఈ రోజు స్కిల్ స్కాంపై చర్చించకుండా తోకముడిచి ఎందుకు పారిపోయాడు..? మీసం తిప్పిన బాలకృష్ణ ఈ రోజు అజెండాలో స్కిల్‌ కేసుపై చర్చ ఉండటంతో పారిపోయారెందుకు..రోషం లేదా? మీ బావ తుప్పు కాదు నిప్పు అని చెప్పడానికి నీ మనస్సాక్షి ఒప్పుకోలేదా? అసెంబ్లీకి వచ్చి ఏం మాట్లాడాలో తెలియక బాబుపై కేసు కొట్టేయాలి అంటూ ప్లకార్డులు పట్టుకుని అరిచాడు.చంద్రబాబు సీటు మీద మనసు పడ్డాడో ఏమో ఆ సీటెక్కి కూర్చోలేక, నిల్చోలేక చిల్లర చేష్టలు చేశాడు.బయట నుంచి కొనుక్కొచ్చిన విజిల్స్‌ వేస్తూ చిల్లర చేష్టలు చేశారు. హైకోర్టులో కూడా క్వాష్‌ పిటిషన్‌ను కొట్టేసింది...ఇప్పుడేమంటావ్‌ బాలకృష్ణ..? నీకు దమ్ము ధైర్యం ఉంటే బాబుపై కేసులు ఎత్తివేయమని కోర్టులోనూ ఇలాగే తొడకొట్టి, విజిల్స్‌ వేయండి.. అప్పుడు తెలుస్తుంది’ అని మంత్రి రోజా అన్నారు.


బాబు నిప్పు అనుకుంటే అసెంబ్లీకి రండి

స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు నిప్పు అనుకుంటే అసెంబ్లీ సమావేశాలకు రావాలని టీడీపీ సభ్యులకు మంత్రి ఆర్‌కే రోజా సవాల్ విసిరారు. రాబోయే సోమ, మంగళ, బుధ వారాల్లో ఎప్పుడైనా చర్చకు తాము సిద్ధం అని ప్రకటించారు. స్కిల్‌ స్కాం ఒక్కటే కాదు...ఫైబర్‌ గ్రిడ్, తాత్కాలిక సచివాలయం వంటి అన్ని స్కాంలపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ‘సినిమాల్లో డైరెక్టర్, రైటర్‌ రాసిచ్చినవి చెప్పడం కాదు బాలకృష్ణ..దమ్ముంటే నా బావ తప్పుచేయలేదని అసెంబ్లీకి వచ్చి చెప్పండి. కావాలంటే ఈడీ, సీబీఐ విచారణలు వేసుకోండని చెప్పాలి కానీ, పారిపోవడం సరికాదు. ఈ రోజు బాలకృష్ణ పారిపోయారంటే మీ బావ తప్పు చేసినట్లు మీరే ఒప్పుకున్నట్లయింది. లోకేశ్‌ ఢిల్లీ వెళ్లి బహిరంగ చర్చకు వస్తారా అని అడుగుతున్నాడు..ఎలాగూ లోకేశ్‌ అసెంబ్లీకి రాలేడు..ఎందుకంటే ఏ ఎన్నికలోనూ ఆయన గెలవలేదు కాబట్టి. సభలో ఎమ్మెల్యేగా మీ మామ బాలకృష్ణ ఉన్నాడు కదా..చర్చకు రమ్మనండి. మేం రెడీగా ఉన్నాం.. మీ మామను, ఎమ్మెల్యేలను రమ్మనండి తేల్చుకుందాం’ అని మంత్రి ఆర్‌కే రోజా ఛాలెంజ్ చేశారు.

Advertisement

Next Story