AP: దుమారం రేపుతున్న వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలు

by Ramesh Goud |   ( Updated:2024-09-28 11:27:24.0  )
AP: దుమారం రేపుతున్న వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తిరుమల పర్యటన రద్దులో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనిపై అధికార పక్ష నాయకులే కాక ప్రజలు సైతం బగ్గుమంటున్నారు. ఒక రాష్ట్రానికి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి దేశం గురించి ఈ విధంగా మాట్లాడటం సిగ్గుచేటని అంటున్నారు. ఒక రాజకీయపార్టీకి అధ్యక్షుడిగా ఉండి ఇదేం దేశం అంటావా అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహరంపై టీడీపీ నాయకులు స్పందిస్తూ.. జగన్ పై దేశ బహిష్కరణ వేటు వేయాలని అంటున్నారు. మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ.. దేశ సాంప్రదాయాలను కించపరుస్తున్న జగన్ దేశంలో ఎందుకు ఉండాలని, జగన్‌ను దేశ బహిష్కరణ చేయాలని అన్నారు. మరోవైపు హోం మంత్రి వంగలపూడి అనిత సైతం ఇదే విధంగా వ్యాఖ్యానించారు. ఇక టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి జగన్ చేసిన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణలు చెప్పాలని.. లేకుంటే దేశం విడిచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. జగన్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.

దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. భారత పౌరుడై ఉండి దేశం గురించి ఎలా మాట్లాడాలో తెలియదా? అంటూ.. తిరుమలకు వెళ్లకపోయినా పర్వాలేదు కానీ ప్రజల విశ్వాసాలు దెబ్బతీసే వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడుతున్నారు. కాగా తిరుమల పర్యటన రద్దు అనంతరం జగన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గుడిలోకి వెళ్లాలంటే డిక్లరేషన్ పై సంతకం పెట్టాలని అంటున్నారని, ఇదేం హిందుత్వం, ఇదేం దేశం అని వ్యాఖ్యానించారు. ఇప్పటికే లడ్డూ వ్యవహరం మెడకు చుట్టుకోవడంతో తీవ్ర అయోమయంలో ఉన్న జగన్ కు ఈ వ్యాఖ్యలు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టాయి. తిరుమల పర్యటన రద్దుపై ప్రభుత్వంపై విమర్శలు చేయడంలో భాగంగా మీడియా ముందు నోరు జారడం జగన్ కు మరింత మైనస్ గా మారింది. లడ్డూ వ్యవహారంలో తన ప్రభుత్వ హయాంలో ఎలాంటి తప్పు జరగలేదని చెప్పుకునే ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఈ వ్యాఖ్యలు దుమారం రేగడం జగన్ ను చిక్కుల్లో పడేసినట్లు అయ్యింది. మరి దుమారం రేగుతున్న ఈ వ్యాఖ్యల పట్ల జగన్ ఎలా స్పందిస్తారోననేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed