- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రెండు చోట్ల కూటమి హవా.. మూడు చోట్ల వాయిదా

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో ఖాళీ ఏర్పడిన మున్సిపల్ పదవులకు ఉప ఎన్నికల ప్రక్రియ ముగిసింది. నిన్న కొన్నింటికి ఎన్నిక జరిగాయి. గొడవలు, కోరం లేకపోవడం ఇతరత్రా కారణాల్లో వాయిదా పడిన వాటికి ఇవాళ ఎన్నికలు నిర్వహించారు. పదవులన్నీ కూటమి పార్టీలే సొంతం చేసుకున్నాయి. ప్రతిపక్ష వైసీపీ గెలుపును అందుకోలేక ఒక పదవిని దక్కించుకోలేకపోయింది. వివాదాలు, ప్రతిపక్షాల ఆందోళనలకు కారణమైన తిరుపతి డిప్యూటీ మేయర్ పదవి ఎన్నికలో టీడీపీ గెలిచి పట్టు నిరూపించుకుంది. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాల్లో ఉదయం 11 గంటలకు డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం మున్సిపల్ సమావేశం మొదలైంది.ఎంపీ గురుమూర్తి తో పాటు 21 మంది వైసీపీ కార్పొరేటర్లు హాజరయ్యారు. నిన్నటి ఘటనల నేపథ్యంలో ఇవాళ 144 సెక్షన్ ఏర్పాటు చేశారు. ఉత్కంఠ మధ్య జరిగిన ఎన్నికల్లో తిరుపతి డిప్యూటీ మేయర్ గా టీడీపీ అభ్యర్థి మునికృష్ణ ఎన్నికయ్యారు. ఆయనకు 26 మంది కార్పొరేటర్లు మద్దతు పలికారు. వైసీపీ అభ్యర్థి లడ్డు భాస్కర్ కు 21 ఓట్లు వచ్చాయి. దీంతో మునికృష్ణ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.
తిరుపతిలో నిన్నటి నుంచి హైడ్రామా నడిచింది. డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా వైసీపీ, టీడీపీ మధ్య పోటా పోటీ నెలకొంది. ఆ పీఠాన్ని దక్కించుకోవాలని ఇరు వర్గాలు విశ్వ ప్రయత్నం చేశాయి. తమ అభ్యర్థులను లాక్కునేందుకు తమ కార్పొరేటర్ల బస్సును టీడీపీ నేతలు ధ్వంసం చేశారని, ఎంపీపై దాడికి పాల్పడ్డారని వైసీపీ నేతలు ఆరోపించాయి. తమ వారిని కిడ్నాప్ చేస్తున్నారంటూ ఆందోళన కూడా దిగాయి. వైసీపీ ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యాన్ని కూడా కిడ్నాప్ చేశారంటూ ఇవాళ ఆరోపించింది. అయితే నన్ను ఎవరో కిడ్నాప్ చేయలేదని అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నానని ఆయన ఓ వీడియో విడుదల చేశారు.
నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠకు తెరపడింది. మున్సిపల్ చైర్ పర్సన్ గా మండవ కృష్ణకుమారి ఎన్నికయ్యారు. ఆమె పదో వార్డు కౌన్సిలర్ గా ఉన్నారు. టీడీపీకి అనుకూలంగా 16 ఓట్లు, వైసీపీకి అనుకూలంగా మూడు ఓట్లు మాత్రమే పడ్డాయి. కృష్ణకుమారి గెలుపొందినట్లు ఆర్డీవో ప్రకటించారు. అధిష్టానం సూచనలతో ఎమ్మెల్యే సౌమ్య, ఎంపీ కేశినేని వెనక్కి తగ్గారు. వారు ప్రతిపాదించిన అభ్యర్థులను తర్వాత ఉప సంహరించుకున్నారు.
శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక నిలిచిపోయింది. ఈ రోజు కూడా వైసీపీ కౌన్సిలర్లు గైర్హాజరవడంతో కోరం లేక ఎన్నికను నిలిపివేశారు. ఈ విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళతామని యశ్వంత్ తెలిపారు. తుని మునిసిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కూడా వాయిదా పడింది. శాంతి భద్రతల సమస్య ఉందంటూ ఎన్నికల అధికారులు వాయిదా వేశారు. అయితే కౌన్సిలర్లను వైసీపీ భయపెడుతోందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఇవాళ కూడా వాయిదా పడింది. ఐదుగురు మాత్రమే హాజరవడంతో కోరం లేక వాయిదా వేసినట్లు ఆర్డీవో ప్రకటించారు. తమ కౌన్సిలర్లను టీడీపీ నాయకులు ఎత్తుకు వెళ్లారని వైసీపీ ఆరోపిస్తోంది. ఇక్కడి పరిణామాలను ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని, వారు ప్రకటించిన తేదీన మళ్లీ ఎన్నిక నిర్వహిస్తామని ఆర్డీవో తెలిపారు.