Ap News: జస్టిస్ బట్టు దేవానంద్ బదిలీ

by srinivas |   ( Updated:2023-03-23 14:41:43.0  )
Ap News: జస్టిస్ బట్టు దేవానంద్ బదిలీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలపై నెలకొన్న సందిగ్ధతకు క్లారిటీ వచ్చేసింది. న్యాయమూర్తుల బదిలీలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ మద్రాసు హైకోర్టుకు బదిలీ అయ్యారు. అలాగే తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవరాజు నాగార్జున కూడా మద్రాసు హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జస్టిస్ బట్టు దేవానంద్ మద్రాస్ హైకోర్టుకు వెళ్లక తప్పనిసరి అయ్యింది. ఇకపోతే గతంలో ఐదుగురు జడ్జిలను బదిలీ చేస్తూ కొలీజియం సిఫారసు చేసింది. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ మద్రాస్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. అయితే జస్టిస్ బట్టు దేవానంద్ బదిలీని నిలిపివేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. అంతేకాదు కేంద్ర న్యాయశాఖ మంత్రిని సైతం కలిసి విన్నవించారు. అయినప్పటికీ బదిలీ మాత్రం ఆగలేదు.

జస్టిస్ బట్టు దేవానంద్ సంచలన తీర్పులివే

ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా మూడేళ్లుగా పని చేస్తున్న జస్టిస్ బట్టు దేవానంద్ సంచలన తీర్పులు వెల్లడించారు. ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో నిందితులకు 41ఏ కింద నోటీసులు ఇవ్వకపోవడాన్ని తప్పుబడుతూ ఏకంగా నాటి డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను కోర్టుకు పిలిపించి ఆయనతో చట్ట నిబంధనలను చదివించి వార్తల్లో నిలిచారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలకు, కార్యాలయాలకు వైసీపీ రంగులేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఈ కేసు విచారణ సందర్భంగా నాటి సీఎస్ నీలం సాహ్నిని కోర్టుకు పిలిపించి మరీ అక్షింతలు వేశారు. అలాగే మూడు రాజధానుల విషయంలోనూ అమరావతి రైతులకు అండగా నిలిచారనే ప్రచారం ఇప్పటికీ ఉంది. అలాగే వలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలంటూ సంచలన ఆదేశాలిచ్చారు.

ఇలా వరుసగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చేవారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఎక్కడ అని ఢిల్లీలో తన కుమార్తెను ఆమె స్నేహితులు ఎగతాళి చేశారని.. రాష్ట్ర రాజధాని ఏదో చెప్పుకోలేని స్థితిలో ఏపీ ప్రజలు ఉన్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైసీపీ కంటగింపుగా మారిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా జస్టిస్ బట్టు దేవానంద్‌పై విరుచుకుపడ్డారు. ఆయన్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. దీంతో ఈ అంశాన్ని సుమోటోగా తీసుకున్న హైకోర్టు ఇప్పటికే పలువురుని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

Also Read...

MLC Election Polling: చాపర్‌లో వచ్చి ఓటేసిన వైసీపీ ఎమ్మెల్యే

Advertisement

Next Story