Ap News: ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఏపీఎస్ ఆర్టీసీ బస్టాండ్లు

by srinivas |
Ap News: ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఏపీఎస్ ఆర్టీసీ బస్టాండ్లు
X
  • మొదటి విడతలో తాడిపత్రి, గుత్తి, కదిరి ఆర్టీసీ బస్టాండ్లు
  • గుత్తి ఆర్టిసి బస్టాండ్ పై ముగిసిన అవగాహన సదస్సు
  • ఉపాధి కోల్పోనున్న లీజుదారుల కుటుంబాలు

దిశ ప్రతినిధి, అనంతపురం: రాష్ట్ర ప్రభుత్వం పలు సంస్థలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పెట్టడం లేదా లీజుకు ఇవ్వడం లాంటివి చేస్తోంది. ఇప్పటికే అనంతరం జిల్లా కేంద్రంలోని షటిల్ బ్యాడ్మింటన్ కోర్టును లీజుకు ఇచ్చే ప్రక్రియను మొదలుపెట్టింది. ఇలా ఒక్కొక్క సంస్థను లీజుకి ఇవ్వడమో లేదా ప్రైవేట్ వ్యక్తుల చేతులకు అప్పగించడమో చేస్తోంది. అదే పద్ధతిలో ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీ‌లో కూడా ప్రైవేటు బస్సులను ప్రవేశపెట్టింది. ఇలా మారుమూల గ్రామాలకు, పల్లెలకు ప్రయాణికుల సౌకర్యార్థం నడుస్తోన్న పలు ఆర్టీసీ బస్సు సర్వీసులను ప్రభుత్వం ప్రైవేటు పరం చేసింది.

ప్రస్తుతం రోడ్డు రవాణా సంస్థకు చెందినఆస్తులను కూడా ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా ఆర్టీసీ బస్టాండ్‌లను సైతం లీజుకి ఇచ్చే పద్ధతికి శ్రీకారం చుట్టింది. లాభాల బాటలో నడపాల్సిన ఆర్టీసీ బస్టాండ్‌లను అభివృద్ధి చేయాల్సింది పోయి అందుకు భిన్నంగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు ప్రభుత్వం పూనుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొదటి విడతగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, కదిరి, గుత్తి ఆర్టీసీ బస్టాండ్లను లీజుకి ఇవ్వడానికి శ్రీకారం చుట్టినట్లు తెలిసింది. అందులో భాగంగానే గుత్తి ఆర్టీసీ డిపో కార్యాలయం, బస్టాండు ఆవరణంలోని వాణిజ్య దుకాణదారులు, స్థలం లీజుదారులు, బిల్డర్లతో ఏపీఎస్ ఆర్టీసీ అనంతపురం రీజినల్ మేనేజర్ సుమంత్ ఆర్.ఆదోని, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సురేంద్రబాబు, గుత్తి డిపో మేనేజర్ నారాయణస్వామి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆర్టీసీ బస్ స్టాండ్ ను లీజుకు ఇవ్వడం వలన తమకు అన్యాయం జరుగుతుందని లీజుదారులు ఆవేదనతో కూడిన ఆందోళన ను వ్యక్తం చేసినట్లు సమాచారం.

లీజుకివ్వడం ఎంతవరకు సమంజసం

1976 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం గుత్తిలో ఏపీఎస్ ఆర్టీసీ బస్టాండు ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించింది. అప్పట్లో రూ.లక్షలు వెచ్చించి బస్టాండ్ భవనాన్ని నిర్మించారు. ఇలా 2.99 ఎకరాల విస్తీర్ణంలో బస్టాండు నిర్మించారు.ఇక్కడ 75 వాణిజ్య దుకాణాలు ఉన్నాయి. బస్టాండ్ ఆవరణలోని స్థలాలను కూడా లీజుకు ఇచ్చారు. దుకాణాలు, స్థలాలకు సంబంధించి ఒక్కొక్కరు నెలకు రూ.4 వేలు నుంచి

రూ.80 వేలు వరకు అద్దెలు చెల్లిస్తున్నారు. ప్రతి నెలా ఏపీఎస్ ఆర్టీసీకి గుత్తి బస్టాండ్ వాణిజ్య దుకాణాదారులు, లీజుదారుల నుంచి అద్దెల రూపంలో రూ.7.22 లక్షల ఆదాయం సమకూరుతోంది. అయితే శిథిలమైన బస్టాండ్ భవనాన్ని ధ్వంసం చేసి నూతన భవనాన్ని ప్రభుత్వం నిర్మించాల్సి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. ఏకంగా ప్రైవేటు వ్యక్తులకు 33 ఏళ్లు లీజుకు ఆర్టీసీ బస్టాండ్‌ను అప్పగించేందుకు నిర్ణయించడం ఎంతవరకు సమంజసమని లీజుదారులు ప్రశ్నిస్తున్నారు. దీనివలన కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉంటూ ఉపాధి పొందుతోన్న తాము రోడ్డున పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రయివేటు వ్యక్తులకు లీజుకు ఇవ్వడం కన్నా ప్రభుత్వమే బస్టాండ్‌ను నిర్మించాలని కోరుతున్నారు.

అయోమయంలో లీజుదారులు

అయితే ఆర్టీసీ బస్టాండుల అభివృద్ధిలో భాగంగా ప్రైవేట్, పబ్లిక్, ప్రాపర్టీ మోడల్ కింద బస్టాండ్ భవనం, కార్యాలయ గదులు, వాణిజ్య దుకాణ సముదాయాలను సివిల్ ఇంజినీరింగ్ శాఖ ద్వారా ప్రైవేటు వ్యక్తులే నిర్మిస్తారని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత స్థలం లీజుదారులు టెండర్ల ద్వారా లీజు దక్కించుకున్నారు. ఏడు నెలల అద్దెలు ముందస్తుగా చెల్లించారు. ఐదేళ్ల అనంతరం మరో రెండు సంవత్సరాలు రెన్యువల్ లీజు చేసుకునే విధంగా ఆర్టీసీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రస్తుతం గుత్తి ఆర్టీసీ బస్టాండును ప్రైవేటు వ్యక్తులకు అప్పగించనున్నారు. దీంతో అప్పులు చేసి, రూ. లక్షలు వెచ్చించి భవనాలు నిర్మించుకుని వ్యాపారాలు చేస్తూ జీవనం కొనసాగిస్తోన్న లీజుదారులు పరిస్థితి అయోమయ స్థితిలో పడతాయి. ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే వారు మొత్తం దుకాణాలను ధ్వంసం చేస్తారు. వాటిని పూర్తి చేయడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. అప్పటి వరకు లీజుదారుల ఉపాధికి గండి పడుతుంది. దీంతో లీజుదారుల కుటుంబాలు రోడ్డున పడతాయి. నిర్మాణాలు పూర్తయిన తరువాత లీజుదారులు ఆర్టీసీ సంస్థను కాదని ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించాల్సి ఉంటుంది. వారు చెప్పిందే వేదంగా లీజుదారులు నడవాల్సి ఉంటుంది. ప్రైవేటు వ్యక్తులు లక్షలాది రూపాయలు అడ్వాన్సు రూపంలో చెల్లించాలని, వేలాది రూపాయలు అద్దెలు ఇవ్వాలని హుకుం జారీ చేస్తే తాము వ్యాపారాలు ఎలా కొనసాగించేదని లీజుదారులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గుత్తి ఆర్టీసీ బస్టాండును అభివృద్ధి చేయడానికి పూనుకోవాలని పలువురు లీజుదారులు కోరుతున్నారు. ఒకవేళ ప్రైవేటు వ్యక్తులకు నిర్మాణాన్ని అప్పగిస్తే ప్రస్తుత లీజుదారుల కుటుంబాలు రోడ్డున పడతాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రైవేటుకు అప్పగించడం అన్యాయం

టెండర్ ద్వారా స్థలాన్ని లీజు తీసుకుని ఏడు నెలల అద్దె ముందస్తుగా చెల్లించి రూ.6.50 లక్షల వ్యయంతో భవనాన్ని నిర్మించుకున్నాను. సంస్థకు ప్రతి నెలా 18 శాతం జీఎస్టీని కలుపుకుని సక్రమంగా అద్దె చెల్లిస్తూ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను. ప్రస్తుతం ప్రయివేటు వ్యక్తులకు లీజుకు ఇస్తే తమకు అన్యాయం జరుగుతుంది. ప్రభుత్వమే బస్టాండ్ నుఅభివృద్ధి చేయాలి.

- మహబూబ్ బాషా (టిప్పు), ఆర్టీసీ స్థలం లీజుదారుడు, గుత్తి.

ప్రభుత్వ మార్గదర్శకాలు మాత్రమే

ప్రభుత్వ మార్గదర్శకాలలో భాగంగా గుత్తి ఆర్టీసీ బస్టాండును అభివృద్ధి చేసేందుకు లీజుదారులతో మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించాం. ప్రజాభిప్రాయాలను సేకరించాం. నివేదికను ప్రభుత్వానికి పంపుతాం. గుత్తి బస్టాండును ప్రయివేటు వ్యక్తులకు లీజుకు ఇచ్చేందుకు ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

- నారాయణస్వామి, ఏపీఎస్ ఆర్టీసీ ఇంచార్జి డిపో, మేనేజర్, గుత్తి.

Advertisement

Next Story

Most Viewed