ప్రాయశ్చిత్త దీక్ష విరమించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఆయన వెంటే త్రివిక్రమ్

by Rani Yarlagadda |   ( Updated:2024-10-02 07:00:36.0  )
ప్రాయశ్చిత్త దీక్ష విరమించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఆయన వెంటే త్రివిక్రమ్
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమలలో స్వామివారి మహాప్రసాదంగా భావించే లడ్డూ కల్తీ అయిందన్న వార్తలు ఏ స్థాయిలో సంచలనం సృష్టించాయో తెలిసిందే. తప్పైపోయిందని, తమను క్షమించాలని స్వామివారిని కోరుతూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సెప్టెంబర్ 22న ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఉమ్మడి గుంటూరు జిల్లా నంబూరులోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ దీక్ష చేపట్టిన పవన్.. 11 రోజుల తర్వాత తిరుమలలో దీక్షను విరమించారు.

నిన్న సాయంత్రం రేణిగుంట ఎయిర్ పోర్ట్ నుంచి తిరుమలకు చేరుకున్న పవన్ కల్యాణ్.. కాలినడకన మెట్లమార్గంలో కొండపైకి వెళ్లారు. తన కుమార్తెలు ఆద్య, పొలెనా అంజన, డైరెక్టర్ త్రివిక్రమ్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు పవన్ కల్యాణ్. అనంతరం గొల్లమండపంలో పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం చేశారు. టీటీడీ అధికారులు పవన్ కు స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం తరిగొండ వెంగమాంబ సత్రానికి వెళ్లిన ఆయన.. అక్కడ అన్నదాన ఏర్పాట్లను, ఆహార నాణ్యతను పరిశీలించారు.

కాగా.. పవన్ ఎక్కడికి వెళ్లినా ఆయన వెంటే త్రివిక్రమ్ ఉంటారన్న విషయం తెలిసిందే. ఆయన తిరుమలకు వెళ్లింది మొదలు.. ఇప్పటి వరకూ ఎక్కడా త్రివిక్రమ్ కెమెరాకు కనిపించలేదు. కానీ.. పవన్ తో కలిసి స్వామివారిని దర్శనం చేసుకున్నారని తెలుస్తోంది.

Advertisement

Next Story