చంద్రబాబుపై ఏపీ సీఐడీ చీఫ్, ఏఏజీల ప్రెస్మీట్ : గవర్నర్ సీరియస్.. విచారణకు ఆదేశం

by Seetharam |   ( Updated:2023-10-20 07:54:24.0  )
చంద్రబాబుపై ఏపీ సీఐడీ చీఫ్, ఏఏజీల ప్రెస్మీట్ : గవర్నర్ సీరియస్.. విచారణకు ఆదేశం
X

దిశ, డైనమిక్ బ్యూరో : స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సీఐడీ చీఫ్ సంజయ్, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిలు ప్రెస్‌మీట్లు పెట్టిన సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన అనంతరం మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో ఉన్న సీఐడీ రాష్ట్ర కార్యాలయంలో సీఐడీ చీఫ్ సంజయ్‌ ప్రెస్‌మీట్ పెట్టి మరీ వివరాలు వెల్లడించారు. అనంతరం హైదరాబాద్, ఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటల్ అశోకలో సీఐడీ చీఫ్ సంజయ్, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిలు ప్రెస్‌మీట్లు పెట్టి మరీ చంద్రబాబు నాయుడుపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ అధికారులుగా ఉంటూ ప్రతిపక్ష నేతకు వ్యతిరేకంగా బహిరంగంగా వ్యాఖ్యలు చేయడంపై సీఐడీ చీఫ్, రాష్ట్ర అడిషనల్ అడ్వకేట్ జనరల్‌లు చిక్కుల్లో పడ్డారు. ప్రభుత్వ ప్రతినిధులుగా కొనసాగుతూ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై పక్షపాత దోరణితో వ్యవహరించడం, లా ఆండ్ ఆర్డర్ కు విఘాతం కలిగించేలా సీఐడీ చీఫ్ సంజయ్‌తోపాటు ఏఏజి పొన్నవోలు సుధాకర్ రెడ్డిపై ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు వరుస ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులపై గవర్నర్ జస్టిస్ అబ్ధుల్ నజీర్ స్పందించారు. ఇరువురుపై ప్రభుత్వం తరపున విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఏపీ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని గవర్నర్ అబ్ధుల్ నజీర్ ఆదేశించడం సంచలనంగా మారింది.

ఆర్టీఐ కార్యకర్త ఫిర్యాదు

స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును సీఐడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబు అరెస్ట్ అనంతరం తదుపరి పరిణామాలపై ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్, ఏఏజి పొన్నవోలు సుధాకర్ రెడ్డిలు ప్రెస్‌మీట్ పెట్టి మరీ వివరణ ఇచ్చారు. అయితే ప్రభుత్వ అధికారులుగా కొనసాగుతున్న వీరు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రతిపక్ష నేతపై ఆరోపణలు చేశారంటూ తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ సైతం పలు ఆరోపణలు చేశాయి. ముఖ్యంగా సీఐడీ చీఫ్ సంజయ్‌ను టార్గెట్ చేస్తూ టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఏపీ యూనైటెడ్ ఫోరమ్ ఫర్ ఆర్టీఐ కాంపైన్ ప్రెసిడెంట్ ఎన్ సత్యనారాయణ గవర్నర్‌కు గత నెల 23న ఫిర్యాదు చేశారు. కృష్ణా జిల్లా ఆరండల్ పేటకు చెందిన ఆర్టీఐ కాంపైన్ ప్రెసిడెంట్ ఎన్.సత్యనారాయణ ప్రభుత్వ అధికారులుగా ఉంటూ ప్రతిపక్ష నేతపై వైసీపీ నేతల మాదిరిగా చట్ట విరుద్ధంగా ఆరోపణలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వైసీపీ కార్యకర్తల్లా ప్రెస్‌మీట్‌లో వ్యవహరించారని.. నేరం చేశారని నిర్ధారణ కాకుండానే చంద్రబాబు నాయుడు నేరం చేశారని పదేపదే ఆరోపించారని సత్యనారాయణ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. చట్ట విరుద్ధంగా వ్యవహరించిన సీఐడీ చీఫ్, ఏఏజీలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు సంబంధించిన పలు ఆధారాలను సైతం గవర్నర్ కార్యాలయానికి పంపించారు.

విచారణకు ఆదేశం

ఆర్టీఐ కాంపైన్ ప్రెసిడెంట్ ఎన్.సత్యనారాయణ ఫిర్యాదుపై గవర్నర్ జస్టిస్ అబ్ధుల్ నజీర్ స్పందించారు. సీఐడీ చీఫ్, ఏఏజి తీరుపై ఎంక్వయిరీ చేయాలని,శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని గవర్నర్ ఆదేశించారు. ఈ మేరకు ఏపీ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని గవర్నర్ ఆదేశించారు. సీఐడీ చీఫ్ సంజయ్, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిల ప్రెస్‌మీట్, వ్యవహరించిన తీరుపై విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని గవర్నర్ ఆదేశించారు.

చంద్రబాబుపై సీఐడీ చీఫ్, ఏఏజీ ఆరోపణలు

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును నంద్యాలలో అరెస్టు చేసినట్లు సీఐడీ చీఫ్ సంజయ్ ప్రకటించారు. ప్రభుత్వ ఖజానాకు రూ.371 కోట్ల నష్టం కలిగించిన కేసులో ఈ అరెస్టు జరిగిందని చెప్పుకొచ్చారు.షెల్ కంపెనీల ద్వారా జరిగిన ఈ మొత్తం స్కాం వెనుక కుట్రదారు చంద్రబాబేనని ఆరోపించారు. ప్రభుత్వం తరఫున ఆదేశాలు ఇవ్వడం, ఎంవోయూ కుదుర్చుకోవడం ద్వారా ఈ కుంభకోణానికి పాల్పడ్డారని పదేపదే ఆరోపించారు. అనంతరం హైదరాబాద్, ఢిల్లీలో ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డితో కలిసి సీఐడీ చీఫ్ సంజయ్ ప్రెస్మీట్లు పెట్టి మరీ విమర్శలు కురిపించారు. ఈ విమర్శలను టీడీపీ తిప్పికొట్టింది. వైసీపీ కార్యకర్తల మాదిరిగా సీఐడీ చీఫ్, ఏఏజీలు మాట్లాడారని టీడీపీ ఆరోపించింది. ఇటీవల టీడీపీ నేతలు గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో భేటీ అయ్యారు. ఆ భేటీలో సైతం సీఐడీ చీఫ్, ఏఏజీలపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

కేంద్ర హోంశాఖకు ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫిర్యాదు

కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సైతం సీఐడీ చీఫ్ సంజయ్‌పై ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు గతంలో ఫిర్యాదు చేశారు. సర్వీస్ రూల్స్ అతిక్రమించి వైసీపీ తొత్తుగా సీఐడీ చీఫ్ సంజయ్ ‌నిచేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఆల్ ఇండియా స‌ర్వీస్ రూల్స్ మేర‌కు రాజ‌కీయ ప‌క్షపాతాలు లేకుండా ప‌నిచేయాల్సిన సీఐడీ చీఫ్ అన్నింటినీ ఉల్లంఘించార‌ని హోం మంత్రికి ఆధారాలతో ఫిర్యాదు చేశారు. వైసీపీ కార్యక‌ర్త మాదిరిగా ప‌నిచేస్తున్న ఐపీఎస్ అధికారి సంజ‌య్, సీఎం వైఎస్ జ‌గ‌న్ కోసం ప్రతిప‌క్షాల‌పై బుర‌ద చ‌ల్లుతున్నారని ఫిర్యాదులో ఎంపీ రామ్మోహన్ నాయుడు పేర్కొన్న సంగతి తెలిసిందే. స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కేసులో చంద్రబాబుని అరెస్టు చేసి విచార‌ణ చేయాల్సిన అధికారి, ఎటువంటి విచార‌ణ జ‌ర‌ప‌కుండానే, స‌ర్వీసు నిబంధ‌న‌ల‌కి వ్యతిరేకంగా దేశ‌వ్యాప్తంగా ప్రెస్ మీట్లు పెడుతూ ఆరోప‌ణ‌లు చేయ‌డం తీవ్రమైన నేరం అని ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. ద‌ర్యాప్తు అంశాలు రూపొందించి కోర్టుల‌కి నివేదించాల్సిన బాధ్యత కలిగిన ఐపీఎస్ అధికారి ఫ‌క్తు వైసీపీ నేత‌లాగ ఢిల్లీ, హైద‌రాబాద్, అమ‌రావ‌తిలో ప్రెస్ మీట్లు పెడుతూ ప్రతిప‌క్ష నేత‌పై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు ద‌ర్యాప్తులో గోప్యంగా ఉంచాల్సిన అంశాలను మీడియాకి విడుద‌ల చేస్తున్నారని ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫిర్యాదులో పేర్కొన్న సంగతి తెలిసిందే.

Advertisement

Next Story