RRR: ఆ నలుగురి వల్లే ‘ఆస్కార్ ’

by srinivas |   ( Updated:2023-03-13 17:21:02.0  )
RRR: ఆ నలుగురి వల్లే ‘ఆస్కార్ ’
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రుల ఆస్కార్ డ్రీమ్ సాకారమైంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ట్రిపుల్‌ఆర్ చరిత్ర పుటల్లోకి ఎక్కింది. ఈ సినిమాలోకి నాటు నాటు పాట ప్రపంచాన్ని ఊపేసింది. దీంతో ఈ పాటకు ఆస్కార్ అవార్డు వరించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాటకు పురస్కారం అందింది. అయితే ట్రిపుల్‌ఆర్ సినిమాతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్లింది మన తెలుగు వ్యక్తి, ఆంధ్రుడు రాజమౌళి. రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించి మెప్పిస్తే.. సంగీత దర్శకుడు కీరవాణి మాత్రం తన మ్యూజిక్‌తో మేజిక్‌ చేసి ప్రతి ఒక్కరితో స్టెప్పులు వేయించారు.


నాటు నాటు పాటకు అవార్డు రావడం వెనుక సంగీతం అందించిన కీరవాణి కృషి చాలా ఉందని చెప్పాలి. అలాగే పాటను వినసొంపుగా పాడిన కాలబైరవ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ కాలభైరవ ఎవరో కాదు కీరవాణి కుమారుడే . అందరూ కాలభైరవను సంగీత దర్శకుడిని చేయొచ్చు కదా అని కీరవాణిని అడిగితే తన కుమారుడికి పాటలు పాడటమంటే ఇష్టమని అందుకే సింగర్ అయ్యాడని చెబుతారు. సంగీతం నేర్చుకోమని ఎప్పుడూ చెప్పలేదని తెలిపారు. అందుకే పాటల్లో కాల భైరవ తన ప్రతిభను చాటుతున్నాడని స్పష్టం చేశారు.

ఇక్కడ మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి విజయేంద్రప్రసాద్. ఈయన రాజమౌళి తండ్రి. అసలు కథ రాసిందే విజయేంద్రప్రసాద్.. ఈ కథలో ఉన్న ప్రధానమైన రెండు కేరక్టర్లను విజయేంద్రప్రసాద్ కలంలో నుంచి తీర్చిదిద్దారు. ఒకటి తెలంగాణ పాత్ర. రెండోది ఆంధ్ర పాత్ర. కొమురం భీమ్ (ఎన్టీఆర్), అల్లూరి సీతారామరాజు (రాంచరణ్). హీరోలు, కథ, రచయిత, ధర్శకుడు, సంగీత దర్శకుడు ఈ నలుగురు కూడా ఆంధ్రులు కావడం విశేషం. విజయేంద్రప్రదేశ్ స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు గ్రామం. రాజమౌళి పుట్టింది కర్ణాటకలోని అమరేశ్వరి క్యాంప్‌లో అయినా తండ్రి వారసత్వంగా చూస్తే ఆయనదీ ఆంధ్రప్రాంతమే. ఇక కీరవాణి బాబాయే విజయేంద్రప్రసాద్. రాజమౌళికి వరుసగా కీరవాణి అన్నయ్య అవుతారు. ఇంతటి ఘన కీర్తిని సాధించడంతో కీరవాణి స్వస్థలంలో సంబురాలు అంబరాన్నంటాయి. కీరవాణితో తమకున్న అనుభవాన్ని నెమరు వేసుకుని తోటి స్నేహితులు, గ్రామస్థులు సంతోషిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా ఆంధ్రులే. ఇప్పటివరకూ తెలుగులో ఎన్నో సినిమాలు, పాటలు వచ్చాయి. కానీ ఇంతటి ఘన విజయం సాధించి ఆస్కార్ అవార్డు దక్కించుకునే స్థాయికి ఆంధ్రులు ఎదగడం తెలుగు సినీ ప్రపంచానికే గర్వకారణం. అందుకే మొత్తం ఆంధ్ర దేశమంతా వీరికి జేజేలు పలుకుతోంది.

Advertisement

Next Story