KA Paul: నన్ను అలా చూపొద్దు... మీడియాపై కేఏపాల్ తీవ్ర అసహనం

by srinivas |
KA Paul: నన్ను అలా చూపొద్దు... మీడియాపై కేఏపాల్ తీవ్ర అసహనం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రజలు తనను ముఖ్యమంత్రిగా చూడాలని ఆశపడుతున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ప్రజల్లో తనకు విపరీతమైన ఆదరణ ఉందని, అయితే మీడియా మాత్రం తనను ఓ కామెడీలా చూస్తోందని.. ప్రజలకు కూడా చూపిస్తోందని ఆయన అసహనం వ్యక్తం చేశారు.మీడియాతో మాట్లాడిన కేఏ పాల్ ఆంధ్రప్రదేశ్ రావణకాష్ఠంగా మారిందని ధ్వజమెత్తారు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డిని కలవడానికి వెళ్లానని.. కానీ ఆయన అక్కడ లేరని చెప్పారు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి విడుదల చేసిన ఆడియో చూసి షాక్ అయ్యానన్నారు. ధర్మవరంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు, దాడులు, దోపిడీలు దారుణమన్నారు. ధర్మవరంలో జనాలు ‘కేతిరెడ్డి వద్దు.. బాబు వద్దు.. మీరు సీఎం కావాలి’ అని అంటున్నారని పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పవన్ అమ్ముడుపోయాడు

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పైనా కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ 15 సీట్లకు అమ్ముడుపోయాడంటూ మండిపడ్డారు. పవన్ కల్యాణ్‌కు దమ్ముంటే 175 స్థానాల్లో పోటీ చేసి తన సత్తా ఏంటో నిరూపించాలని సవాల్ విసిరారు. లేకపోతే జనసేన పార్టీని ప్రజాశాంతి పార్టీలోకి విలీనం చేయాలని సూచించారు. పవన్ కల్యాణ్ ఓ ప్యాకేజీ స్టార్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్‌లా తాను 100 మంది బౌన్సర్లతో వెళ్లడం లేదని చంద్రబాబులా హై సెక్యూరిటీతో తిరగడం లేదని అన్నారు. ప్రజల్లోకి సింగిల్‌గా వెళ్తున్నట్లు స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర వదిలేసి లోకేశ్ కోసం నారాహి యాత్ర చేస్తున్నాడంటూ తీవ్ర విమర్శలు చేశారు. 2008లో పార్టీ పెట్టిన చిరంజీవి వెంట వెళ్లిన బీసీ, ఎస్సీ, ఎస్టీలు కొన్ని కోట్ల రూపాయలు నష్టపోయారంటూ కేఏపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం, పవన్ కల్యాణ్ పార్టీ టీడీపీ, బీజేపీలతో విలీనం అని కేఏపాల్ జోస్యం చెప్పారు.

చంద్రబాబు నాతో డిబేట్‌కు రా

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వందల హామీలు ఇస్తారని కానీ ఒక్కటి కూడా నెరవేర్చరని విమర్శించారు. ఈ అంశంపై దమ్ముంటే తనతో చంద్రబాబు డిబెట్‌కు రావాలని సవాల్ విసిరారు. లోకేశ్‌కు మాట్లాడటం రాదని, కాబట్టి తనతో డిబెట్‌కు చంద్రబాబే రావాలని సూచించారు. మాటలు రాని పప్పును సీఎం చేయడానికి చంద్రబాబు అవస్థలు పడుతున్నాడంటూ కేఏపాల్ ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story