BV Raghavulu : రెండు జిల్లాల్లో అపార నష్టం.. సీఎం జగన్‌కు లేఖ

by srinivas |   ( Updated:2023-03-23 12:50:54.0  )
BV Raghavulu : రెండు జిల్లాల్లో అపార నష్టం.. సీఎం జగన్‌కు లేఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో : అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో భారీ గాలులు, వడగండ్ల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు అసాధారణ నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు లేఖ రాశారు. గత నాలుగు రోజుల క్రితం అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలో వీచిన భారీ గాలులు, వడగండ్ల వానల వల్ల పంటలు నష్టపోయిన ప్రాంతాల్లో తనతోపాటు సీపీఎం పార్టీ సభ్యులు పర్యటించినట్లు లేఖలో వెల్లడించారు.


ఈ ప్రాంతాలలో అరటి, మొక్కజొన్న, టమోటా, బత్తాయి, దానిమ్మ, బొప్పాయి, కరివేపాకు పంటలు తీవ్రంగా నష్టపోయినట్లు వెల్లడించారు. దీంతో రైతుల పరిస్థితి హృదయవిదారకంగా ఉందన్నారు. సర్వస్వం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నారని లేఖలో స్పష్టం చేశారు. చేతికి వచ్చిన అరటి, బత్తాయి, బొప్పాయి పంటలు పూర్తిగా దెబ్బతిని, రైతులకు కోట్ల రూపాయల నష్టం జరిగిందని ప్రభుత్వం తక్షణమే వెంటనే స్పందించి ప్రత్యక్షంగా పంటల నష్టాన్ని పరిశీలించి రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని లేఖలో కోరారు.


ఈ రెండు జిల్లాలలో 580 ఎకరాల్లో అరటి పంట దెబ్బతినడం వల్ల సుమారు రూ. 50 కోట్లు వరకు నష్టం వాటిల్లిందని చెప్పుకొచ్చారు. అలాగే 16 మండలాల్లో 11,052 ఎకరాల్లో ఉద్యానవన పంటలు దెబ్బతిని రూ. 211.91 కోట్లు నష్టం జరిగినట్లు చెప్పుకొచ్చారు. ఈ అపార నష్టాన్ని పూడ్చాలంటే మామూలు స్థాయిలో కాకుండా అదనపు పరిహారం చెల్లించాలి. కావున అసాధారణ నష్టపరిహారం చెల్లించి కౌలురైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు ఆత్మ విశ్వాసం కల్పించేందుకు తక్షణం కొంత మొత్తాన్ని ఎక్స్‌గ్రేషియోగా రైతులకందించాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story