సీఎం జగన్ అనంతపురం పర్యటన వాయిదా

by Javid Pasha |   ( Updated:2023-04-16 15:51:52.0  )
సీఎం జగన్ అనంతపురం పర్యటన వాయిదా
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉమ్మడి అనంతపురం జిల్లా పర్యటన వాయిదా పడింది. ఈనెల 17న అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలోని నార్పల మండల కేంద్రంలో సీఎఎం వైఎస్ జగన్ పర్యటించాల్సి ఉంది. జగనన్న వసతి దీవెన కార్యక్రమానికి సంబంధించిన సభలో పాల్గొని లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయాల్సి ఉండింది. ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించి అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. సీఎం జగన్ పర్యటన సందర్భంగా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉషశ్రీచరణ్, సీఎం జగన్ ప్రోగామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, కలెక్టర్ గౌతమి, ఎస్పీ శ్రీనివాసరావు, ఇతర అధికారులు ఏర్పాట్లను పరిశీలించిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల నార్పల మండల కేంద్రంలో సోమవారం జరగబోయే జగనన్న వసతి దీవెన కార్యక్రమం వాయిదా వేస్తున్నట్లుగా అధికారులు ప్రకటించారు.

అయితే ఈనెల 17న సాయంత్రం విజయవాడ వన్‌ టౌన్‌ విద్యాధరపురంలోని మినీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఇఫ్తార్‌ విందు కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారని సీఎంవో తెలిపింది. ఇందులో భాగంగా సాయంత్రం 5.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 5.45 గంటలకు విద్యాధరపురం మినీ స్టేడియంకు చేరుకుంటారు. 5.45 – 7.15 గంటల వరకు ఇఫ్తార్‌ విందులో పాల్గొని అనంతరం రాత్రి 7.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారని వెల్లడించింది. మరోవైపు సీఎం జగన్ ఈ నెల 26న అనంతపురం జిల్లా నార్ఫల పర్యటనకు వెళ్లనున్నట్టుగా సీఎంవో అధికారులు తెలిపారు. ఇకపోతే వైఎస్ వివేకా హత్యకేసులో సీబీఐ దూకుడు పెంచింది. వైఎస్ భాస్కర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలాంటి తరుణంలో సీఎం జగన్ అనంతపురం పర్యటన వాయిదా వేసుకోవడం తీవ్ర చర్చనీయాశంగా మారింది.

ఇవి కూడా చదవండి : Mla KotamReddy: సీఎం జగన్‌కు మరో అల్టిమేటం

Advertisement

Next Story