Alla Nani: ఏపీ రాజయకీయాల్లో చర్చనీయాంశంగా జగన్ నమ్మిన బంటు రాజీనామా!

by Ramesh Goud |
Alla Nani: ఏపీ రాజయకీయాల్లో చర్చనీయాంశంగా జగన్ నమ్మిన బంటు రాజీనామా!
X

దిశ, డైనమిక్ బ్యూరో: గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి ఆళ్ల నాని పార్టీకి రాజీనామా చేశారు. గతంలో ఏలూరు జిల్లా అధ్యక్ష పదవితో పాటు నియోజకవర్గ ఇంచార్జి పోస్టులకు రాజీనామా చేసిన ఆయన ఇప్పుడు ఏకంగా పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తన వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నానని చెప్పారు. తదుపరి కార్యచరణ గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, కొంతకాలం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు వెల్లడించారు.

అలాగే పార్టీ ఆఫీస్ విషయంలో అపోహలు వద్దని, కార్యాలయం కోసం స్థలాన్ని రెండు సంవత్సరాల లీజు తీసుకున్నామని, లీజు గడువు పూర్తి అవ్వడంతోనే షెడ్లను కూల్చేశారని తెలిపారు. ఇక వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో డిప్యూటీ సీఎం సహా పలు శాఖలకు మంత్రిగా చేసిన ఆళ్ల నాని పార్టీకి రాజీనామా చేయడం ఆసక్తిగా మారింది. వైసీపీలో కీలకంగా వ్యవహరించిన నాని పార్టీని వీడటంతో వైసీపీ కార్యకర్తలు తీవ్ర గందరగోళంలో పడ్డారు. జగన్ కు నమ్మిన బంటుగా ఉన్న నాని రాజీనామా చేయడం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఇప్పటికే అధికారం కోల్పోయి, ప్రతిపక్ష హోదా కూడా దక్కక దిక్కుతోచని పరిస్థితులలో ఉన్న జగన్ కు కీలక నేత రాజీనామా అయోమయంలో పడేసిట్టు అయ్యింది.

బయటకి చెప్పకున్నా.. పార్టీ ఓటమి, జగన్ వ్యవహార శైలి, కీలక నేతల నడవడిక సహా తదితర కారణాలతో ఇప్పటికే కొందరు నేతలు పార్టీని వీడగా.. ఇప్పుడు మరికొందరు కూడా బయటికి వెళ్లేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఇలా నేతలంతా వరుసగా పార్టీని వీడుతుండటం, వీరితో పాటు క్యాడర్ కూడా జారుకోవడం వైసీపీని మరింత బలహీనపరుస్తున్నాయి. ఇక కూటమి ప్రభుత్వం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రులు, నాయకులు చేసిన అక్రమాలను ఒక్కొక్కటిగా బయటకి తీస్తుండటం, మరో పక్క లీడర్లు చేజారుతుండటం జగన్ ను చిక్కుల్లోకి నెడుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే ఏపీలో వైసీపీ మనుగడే ప్రమాదంలో పడే అవకాశం ఉందనే యోచనలో జగన్ ఉన్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Advertisement

Next Story