AP:పచ్చదనం ఆవశ్యకతను విద్యార్థులంతా గ్రహించాలి:సీఎం చంద్రబాబు

by Jakkula Mamatha |
AP:పచ్చదనం ఆవశ్యకతను విద్యార్థులంతా గ్రహించాలి:సీఎం చంద్రబాబు
X

దిశ,మంగళగిరి:అడవులు నరికితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం సాయంత్రం మంగళగిరి ఎకో పార్క్ ఆవరణలో ఆటవీ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వనమహోత్సవం నాకు ఎంతో ఇష్టమైన కార్యక్రమం అన్నారు. వనమహోత్సవం ఎంతో మహత్తరమైన కార్యక్రమం అని అన్నారు. ఇంకుడు గుంతలు తవ్వితే చాలామంది ఎగతాళి చేశారు. భూగర్భ జలాలు పెరగాలంటే ఇంకుడు గుంతలు తవ్వాం. ఏ పని చేసినా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటాం. పచ్చదనం ఆవశ్యకతను విద్యార్థులంతా గ్రహించాలి. రాష్ట్రంలో పచ్చదనం 50 శాతానికి పెరగాలి. ప్రతి ఒక్కరూ ఏటా రెండు మొక్కలు నాటాలి.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వద్ద అటవీశాఖ, నరేగా శాఖలు ఉన్నాయి. రెండు శాఖల సాయంతో పవన్ మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలి. హైదరాబాద్‌లో గుట్టలు, రాళ్ల ప్రాంతాల్లోనే మొక్కలు నాటాం. మిషన్ హరితాంధ్రప్రదేశ్‌కు 2014లోనే శ్రీకారం చుట్టాం రానున్న కాలంలో డ్రోన్స్‌తో సీడ్ బాల్స్ వేసే కార్యక్రమాలు చేపడతామని అన్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నగరవనాలు ఏర్పాటు చేస్తామని, జపాన్‌లోని మియాబకీ విధానంలో పచ్చదనం పెంచుతాం అన్నారు. రాష్ట్రంలో అటవీ ప్రాంతం క్రమంగా తగ్గిపోతుంది. పర్యావరణంలో పెనుమార్పులు వస్తున్నాయని, భూతాపం, కాలుష్యం బాగా పెరిగి పోతుందన్నారు.

పరిశ్రమలు, వాహనాల కాలుష్యం పెరుగుతోంది. పర్యావరణ పరిరక్షణ పై అందరూ అవగాహన పెంచుకోవాలి. వైసీపీ హయాంలో సహజ వనరులను ధ్వంసం చేశారని ఆరోపించారు. వైసీపీ హయాంలో నదులు, చెరువులు, కొండలు ధ్వంసం చేశారు. మొక్కలు పెంచుతాం..చెట్లు కొట్టనివ్వం.. ఇదే మా విధానం. అమరావతిని సుందరమైన నగరం గా మార్చుతాం. అడవుల్లో మేం ఎర్రచందనం పెంచితే.. వైసీపీ ప్రభుత్వం స్మగ్లింగ్ చేసింది. పెద్ద ఎత్తున ఇసుకను దొంగ రవాణా చేశారు. రుషికొండను కొట్టేసి..రూ.500 కోట్లతో ప్యాలెస్ కట్టారు. శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు విధ్వంసం చేశారు.

రౌడీ పాలనకు జనమంతా భయపడిపోయారు. ఏపీలో ఇప్పుడు ప్రజలకు స్వేచ్ఛ ఉంది. నటి జత్వానీని తీవ్రంగా హింసించారని చంద్రబాబు అన్నారు. జత్వానీ దొంగ సంతకాలతో ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించారు. నటిపై బూటకపు కేసులు పెట్టి వేధించారు. ప్రజలకు రక్షణ కల్పించవలసిన పోలీసులు తొత్తులుగా వ్యవహరించారు. కాపాడాల్సిన పోలీసులే ఇలా చేస్తే.. ఇంకా రక్షణ ఎవరు కల్పిస్తారు? ముంబైలో ఉండే నటిని ఇక్కడికి తీసుకొచ్చి వేధించారంటే..పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు . ముంబై నటి న్యాయం కోసం వచ్చింది, ఆమెకు న్యాయం చేస్తాం . ఎంత పెద్ద వాళ్ళు అయినా వదిలిపెట్టం. మాది ప్రజా ప్రభుత్వం.. ప్రజల కోసమే పని చేస్తాం అన్నారు.

భవిష్యత్తులో విద్యుదుత్పత్తిలో కాలుష్యం ఉండదు. సోలార్, విండ్, పంప్‌డ్ ఎనర్జీ తీసుకొస్తున్నాం. జీవ వైవిధ్యానికి మన రాష్ట్రం చిరునామా కావాలి. ఎర్రచందనం దొంగలను హెచ్చరిస్తున్నాం. అడవులు నరికితే కఠిన చర్యలు ఉంటాయి. స్వచ్ఛమైన గాలి, నీరు అందరికీ అందుబాటులో ఉండాలి. సంకల్పం ఉంటేనే అనుకున్న లక్ష్యాలను సాధించగలం. మౌలిక వసతులు కల్పించి పల్లెల రూపురేఖలు మారుస్తాం. ఆర్థిక అసమానతలు తగ్గేలా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు అన్నారు.

Advertisement

Next Story

Most Viewed