YS Sharmila : అసెంబ్లీకి వెళ్ళకుంటే వైసీపీ శాసనసభ సభ్యులంతా రాజీనామా చేయాలి : ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల

by Y. Venkata Narasimha Reddy |
YS Sharmila : అసెంబ్లీకి వెళ్ళకుంటే వైసీపీ శాసనసభ సభ్యులంతా రాజీనామా చేయాలి : ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల
X

దిశ, వెబ్ డెస్క్ : అసెంబ్లీ(Assembly)కి వెళ్ళే దమ్ము ధైర్యం లేకుంటే వైసీపీ(YCP) శాసనసభా పక్షం మొత్తం రాజీనామాలు చేయాలని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) డిమాండ్ చేశారు. అప్పుడు ఇంట్లో కాదు..ఎక్కడైనా కూర్చుని తాపీగా మాట్లాడుకోండని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్(YS Jagan)ను షర్మిల ఎద్దేవా చేశారు. ప్రజలిచ్చిన తీర్పును గౌరవించి జగన్ ప్రతిపక్ష నేత హోదా కోసం మారాం చేయడం మాని ప్రజల గొంతుకగా మారి అసెంబ్లీలో ప్రజా సమస్యలపై గళమెత్తాలని హితవు చెప్పారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరు అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుందని, అసెంబ్లీ మీద అలగడానికో.. మైకు ఇస్తేనే పోతానని మారం చేయడానికో కాదు ప్రజలు మీకు ఓట్లేసిందని చురకలేశారు. ఇంట్లో కూర్చొని సొంత మైకుల్లో మాట్లాడేందుకు కాదు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించిందని, మీ స్వయం కృతాపరాధం మిమ్మల్ని ప్రతిపక్ష హోదాకి దూరం చేస్తే, ఆ హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతా అనడం మీ అవివేకానికి, అజ్ఞానానికి నిదర్శనమని జగన్ తీరుపై షర్మిల మండిపడ్డారు.

అసెంబ్లీ అనేది ప్రజాస్వామ్య దేవాలయమని, ప్రజల పట్ల, ప్రజా సమస్యల పట్ల అధికార పక్షాన్ని నిలదీసేందుకు ప్రజలు ఇచ్చే గొప్ప అవకాశమని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు దిక్కులేదని, మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదని, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని, మహిళలపై దాడులు ఆగడం లేదన్నారు. ఇసుక మాఫియా రాజ్యమేలుతోందని, బెల్టు షాపుల దందాను అరికట్టలేదని, 5 నెలలైనా ఒక్క ఉద్యోగం భర్తీ కాలేదని, రోజు రోజుకు నిరుద్యోగం పెరుగుతోందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా గొంతుక అయ్యే అవకాశం వైసీపీకి ప్రజలు ఇస్తే...ప్రతిపక్షం ఇస్తేనే అసెంబ్లీకి వస్తాం అనడం సిగ్గు చేటన్నారు.

ప్రతిపక్షం లేకుంటే సభలోనే ప్రజాపక్షం అవ్వాలని ఇంగితం కూడా లేకపోవడం బాధాకరమన్నారు. 1994లో కాంగ్రెస్ పార్టీ 26 సీట్లకే పరిమితం అయినా.. కుంగిపోలేదని, మీ లెక్క హోదా కావాలని మారం చేయలేదని, 26 మంది సభ్యులతో సభలో ప్రజల పక్షంగా నిలబడ్డారని, ఎన్నో సమస్యలపై ఆనాడు టీడీపీ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ చుక్కలు చూపించిందని గుర్తు చేశారు. 2014లో కేంద్రంలో 44 సీట్లకే పరిమితం అయినా, 2019లో 52 సీట్లే వచ్చినా ప్రతిపక్ష హోదా కావాలని అడగలేదని, హోదా లేకున్నా రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలు ప్రజా సమస్యలపై తమ గొంతు వినిపించారని, నియంత మోడీ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారని, దేశ ప్రజల సమస్యలపై కాంగ్రెస్ గొంతుకగా మారిందని చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా మీ పిచ్చితనాన్ని పక్కన పెట్టి అసెంబ్లీకి వెళ్ళండని, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టండని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed