ALERT: ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ!

by Ramesh Goud |
ALERT: ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ లోని ధవళేశ్వరం వద్ద గోదావరి ఉదృతి పెరగడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో గోదావరి ఉదృతి క్రమంగా పెరుగుతోంది. ఈ నేపధ్యంలోనే ధవళేశ్వరం కాటన్ బ్యారీజీ వద్ద 13.75 అడుగుల నీటి మట్టం కొనసాగుతోంది. దీంతో అధికారులు ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. వరద క్రమంగా పెరుగుతుండంతో బ్యారేజీ గేట్లు ఎత్తి సముద్రంలోకి 13 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. దీంతో ముంపు ప్రాంతాలతో పాటు లంక గ్రామాలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నాయి.

భద్రాచలం వద్ద గోదావరి నది ప్రవాహం క్రమంగా పెరుగుతోంది ప్రస్తుతం 51.8 అడుగుల వద్ద ప్రవహిస్తుండటంతో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. దీనిపై అధికారులు నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. భద్రాచలం వద్ద ఇప్పటివరకు మూడు సార్లు రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే ఏటపాక వాగు పొంగడంతో కొత్త కాలనీలోని 36 కుటుంబాలను భద్రాచలం నన్నపనేని హై స్కూల్ లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. ఏటపాక బ్యాక్ వాటర్ ను అధికారులు మోటార్ల ద్వారా ఎత్తిపోస్తున్నారు. వరద ఉదృతి ఇలాగే కొనసాగితే భద్రచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉంది.

Advertisement

Next Story