అంతా విద్వేష రాజకీయాలే..ప్రతిపక్షాలను అణచివేయాలని వైసీపీ

by samatah |
అంతా విద్వేష రాజకీయాలే..ప్రతిపక్షాలను అణచివేయాలని వైసీపీ
X

ప్రతిపక్షాలను అణచివేసి అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని వైసీపీ లక్ష్యంగా పెట్టుకుంది. వైసీపీని ఎలాగైనా ఓడించి అధికారాన్ని కైవసం చేసుకోవాలని ప్రధాన ప్రతిపక్షాలు అడుగులేస్తున్నాయి. పార్టీ శ్రేణుల్లో సెంటిమెంటు, ఉద్రేకాన్ని సృష్టించేట్లు విపక్ష నేతల ప్రసంగాలున్నాయి. వ్యక్తిత్వ హననం, దుర్భాషలను అధికార పార్టీ నేతలు భుజానికెత్తుకుంటున్నారు. ఈ మధ్యలో సగటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల అజెండా పక్కదారి పడుతోంది. అధికారానికి వస్తే సమస్యలను తామెలా పరిష్కరిస్తామో స్పష్టంగా ప్రతిపక్షాలు చెప్పలేకపోతున్నాయి. ప్రతిపక్షాల వైఫల్యాలను ఆదరువు చేసుకొని అధికార పార్టీ ఇష్టారీతిన జీవోలు ఇవ్వడం.. ఆనక న్యాయస్థానాల చుట్టూ ప్రదక్షిణలు చేయడమే పాలనగా సాగుతోంది. ఈ పోకడలతో సామాన్య ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.

దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ అధికారాన్ని చేపట్టిన నాటి నుంచే 2024 ఎన్నికలే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఓటు బ్యాంకులను సుస్థిరం చేసుకోవడంపైనే గురి పెట్టింది. అందుకు అనుగుణంగా నగదు బదిలీ పథకాలను అమలు చేస్తోంది. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు తిరోగమనంలో ఉన్నాయి. రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సరఫరా, పారిశుధ్యం, నీటి పారుదల ప్రాజెక్టులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. గ్రామ పంచాయతీల నిధులను దారి మళ్లించేసి స్థానిక ప్రభుత్వాలను ఉత్సవ విగ్రహాలుగా మార్చేసింది. విద్య, వైద్య రంగాల్లో కొంత మెరుగుదల సాధించినా ఆ సేవలు సగటు ప్రజల దరి చేరలేదు. ప్రభుత్వం ఒంటెత్తు పోకడల వల్ల వీటి ఫలితాలు సామాన్యులు పూర్తిగా వినియోగించుకునే పరిస్థితుల్లేవు. ఒక చేత్తో సంక్షేమ పథకాలు అందిస్తూ మరో రెండు చేతులతో భారాలు మోపుతున్నారు. టీడీపీ పాలనలో పెనం మీద వేగుతూ వైసీపీ పాలనలో పొయ్యిలో పడినట్టుందని అత్యధిక ప్రజలు వాపోతున్నారు.

తాత్కాలిక ప్రయోజనాలకే పెద్దపీట

గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తి పెరగకుండా సమగ్ర అభివృద్ధి సాధ్యం కాదు. వ్యవసాయ రంగంలో 75 శాతం కౌలు రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన కౌలుదారీ చట్టం వాళ్ల జీవితాలను రోడ్డున పడేసింది. ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు పంటలు సాగు చేసేవాళ్లకు దక్కడం లేదు. అసలు వ్యవసాయ రంగంలో ప్రభుత్వానికి ఓ లక్ష్యమంటూ లేకుండా పోయింది. ఇక్కడ కూడా నగదు బదిలీ పథకం అమలు చేయడం తప్ప వ్యవసాయాన్ని గిట్టుబాటు చేసే చర్యలు తీసుకోలేకపోయింది. దీంతో అర్బన్‌లో పారిశ్రామిక వృద్ధికి నోచుకోక నిరుద్యోగం తాండవిస్తోంది. ఉపాధితో కూడిన అభివృద్ధికి బాటలు వేయాల్సిన ప్రభుత్వం తాత్కాలిక వ్యక్తిగత ప్రయోజనాలకే పెద్దపీట వేస్తోంది. సమస్యలను నిలదీయడం, పరిష్కార మార్గాలు చూపడంలో టీడీపీ, జనసేన వైఫల్యాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి.

వ్యక్తిగత దూషణలపైనే దృష్టి

టీడీపీ నేతలు చంద్రబాబు, ఆయన తనయుడు పోటీ చేసే నియోజకవర్గాల్లో ఎలాగైనా ఓడించాలనే దానిపైనే అధికార పార్టీ నేతలు దృష్టిసారిస్తున్నారు. కుప్పం, మంగళగిరి నియోజకవర్గాలపైనే బలం, బలగాన్ని కేంద్రీకరిస్తున్నారు. విపక్ష నేతలపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. సమస్యలపై నిలదీస్తే వ్యక్తిత్వ హననానికి పాల్పడేట్లు వ్యవహరిస్తున్నారు. వాస్తవ సమస్యలను విస్మరించి అధికార పార్టీ నేతల వ్యక్తిగత ఆరోపణలు, దుర్భాషలపైనే ప్రతిపక్ష నేతలు ఎదురు దాడి చేస్తున్నారు. ఆయా పార్టీ శ్రేణుల్లో ఉద్వేగాన్ని రగిల్చేట్లు ప్రసంగాలు చేస్తున్నారు. దీంతో సామాన్యుల అజెండా పక్కదారి పడుతోంది. ఈ విద్వేష రాజకీయాలు ఎక్కడకు దారితీస్తాయోనని సర్వత్రా ఆందోళన నెలకొంది.


Advertisement

Next Story

Most Viewed