AP News : డీజీపీ ఆఫీస్ ముట్టడికి TDP యత్నం

by Hajipasha |   ( Updated:2022-08-25 18:41:45.0  )
AP News : డీజీపీ ఆఫీస్ ముట్టడికి TDP యత్నం
X

దిశ, ఏపీ బ్యూరో : కుప్పంలో చంద్రబాబు నాయుడు పర్యటనలో ఎదురవుతున్న అడ్డంకులు, అన్న క్యాంటీన్‌ను ధ్వంసం చేయడంపై తెలుగుదేశం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చర్యలను నిరసిస్తూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి పీతల సుజాతతోపాటు పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ శ్రేణుల చర్యలు, పోలీసుల తీరును నిరసిస్తూ డీజీపీ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయం నుంచి డీజీపీ ఆఫీస్ వరకు భారీ ర్యాలీగా వెళ్లారు.

వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డీజీపీ కార్యాలయం ప్రధాన గేటు నుంచి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో డీజీపీ ఆఫీస్ ఎదుట నేల మీద కూర్చోని అచ్చెన్నాయుడు, పీతల సుజాత, పట్టాభిరామ్ ఇతర నేతలు నిరసన తెలిపారు. సీఎం డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే పోలీసులు వారిని అక్కడ నుంచి తరలించేందుకు ప్రయత్నించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

జగన్ స్కెచ్‌లో భాగమే

అంతకు ముందు టీడీపీ జాతీయ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. కుప్పంలో చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు పర్యటనకు అన్ని అనుమతులు ఉన్నాయని అయినప్పటికీ పోలీసులు బందోబస్తు కల్పించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబును కుప్పంలో తిరగనియ్యకుండా వైసీపీ శ్రేణులు కుట్రలు చేస్తున్నారని వాటన్నింటని టీడీపీ ఎదుర్కొంటుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రారంభించాల్సిన అన్న క్యాంటీన్‌ను వైసీపీ శ్రేణులు ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గమన్నారు. వైఎస్ జగన్ స్కెచ్‌లో భాగంగానే ఈ క్యాంటీన్ ధ్వంసం చేశారని ఆరోపించారు.

త్వరలోనే కడపలో కూడా భారీ సభ పెడతామని దాన్ని ఎలా అడ్డుకుంటారో చూస్తామని సీఎం జగన్‌కు సవాల్ విసిరారు. కుప్పంలో ఘటనలకు ప్రతీ ఒక్కరూ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. శాంతియుత వాతావరణంలో చంద్రబాబు పర్యటిస్తుండగా దాన్ని తట్టుకోలేక వైసీపీ శ్రేణులు శాంతి భద్రతల సమస్యలను సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇకనైనా పోలీసులు స్పందించి కుప్పంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న వైసీపీ శ్రేణులను అరెస్ట్ చేయాలని లేని పక్షంలో సీఎంవో, డీజీపీ కార్యాలయాలను ముట్టడిస్తామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

ఆంధ్రలో బర్త్ డే చేసుకున్న తెలంగాణ ఎంపీ

Advertisement

Next Story