బయటపడిన 23వేల ఏళ్ల నాటి పాదముద్రలు.. ఇదిగో సాక్ష్యం

by Shyam |
బయటపడిన 23వేల ఏళ్ల నాటి పాదముద్రలు.. ఇదిగో సాక్ష్యం
X

దిశ, ఫీచర్స్ : విశ్వంలో భూగ్రహం ఏర్పడినప్పటి నుంచి మనుగడ సాగించిన ఎన్నో నాగరికతలు కాలక్రమేణా అంతరించిపోయాయి. అయితే, పురావస్తు తవ్వకాల్లో బయటపడుతున్న అనేక అవశేషాలు అప్పటి చరిత్రకు సాక్ష్యంగా నిలిచి ఆసక్తికర విషయాలను వెల్లడిస్తుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా యునైటెడ్ స్టేట్స్‌లో 23,000 ఏళ్ల కిందటి పాదముద్రలు కనుగొనబడ్డాయి. చివరి మంచుయుగం ముగియడానికి చాలా కాలం ముందే మానవులు ఉత్తర అమెరికాలో స్థిరపడినట్లు వీటి పరిశోధనలో తేలింది. వేల సంవత్సరాల కిందట మొదటి తరం మనుషులు ఈ ఖండంలో నివసించిన తేదీని కనుగొనేందుకు ఈ పరిశోధన సాయపడనుంది. అప్పటి మనుషుల పాదముద్రలు ఇప్పుడు గట్టిపడి రాయి మాదిరి మారిపోగా, ఇవి పురాతన మనుషుల సంతతితో పాటు వారి జీవితాలపై వివరణాత్మక అంతర:దృష్టిని శాస్త్రవేత్తలకు అందించే అవకాశం ఉంది.

మమ్ముత్‌లు, ప్రాచీన తోడేళ్ళు, భారీ స్లోత్స్ నడిచిన బాటలను కనుగొన్న పరిశోధకులు.. వీటి పక్కనే మానవుల పాదముద్రలను కనుగొన్నారు. అంటే ఆ భారీ జంతువులను ప్రాచీన మానవులు వేటాడేవారనే విషయం అర్థమవుతోంది. వీరు తూర్పు సైబీరియా నుంచి లాండ్ బ్రిడ్జి (ప్రస్తుతం బెర్నింగ్ జలసంధి) మీదుగా ఉత్తర అమెరికాకు వలస వచ్చి ఉంటారన్న సిద్ధాంతం దశాబ్దాల కిందటి నుంచే చెలామణిలో ఉంది. మమ్ముత్‌లను చంపడానికి ఉపయోగించే స్పియర్‌హెడ్స్‌తో సహా పురావస్తు ఆధారాలు సైతం.. క్లోవిస్ సంస్కృతిగా పిలవబడే 13,500 సంవత్సరాల నాటి పురాతన జీవుల గురించి సూచిస్తున్నాయి.

ప్రస్తుతం న్యూ మెక్సికోలోని ఒక పట్టణానికి క్లోవిస్ పేరు పెట్టబడింది. ఏదేమైనా, క్లోవిస్ సంస్కృతి మనుగడపై గత 20 ఏళ్లుగా ఉన్న అభిప్రాయాలు.. కొత్త ఆవిష్కరణలతో వెనక్కినెట్టబడ్డాయి. దాదాపు 20,000 సంవత్సరాల క్రితం వరకు కొనసాగిన ఈ ఎపిసోడ్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ ఖండంలోని ఉత్తర ప్రాంతాల్లో మంచు కప్పబడి ఉండటంతో, ఆసియా నుంచి ఉత్తర అమెరికాకు మానవ వలసలు చాలా కష్టంగా ఉండేవి.

Advertisement

Next Story