- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BJP గెలుపులో MIM మార్క్.. నిగూఢ రహస్యం ఇదేనా!
దిశ, వెబ్‌డెస్క్: వచ్చే ఫిబ్రవరి-మార్చిలో జరిగే ఉత్తర్‌ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వంద సీట్లలో పోటీ చేస్తామని ఏఐఎంఐఎం (ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్) అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఆ మధ్యన ప్రకటించారు. భాగీదారీ సంకల్ప్ మోర్చాతో ఈ మేరకు ఎన్నికల ఒప్పందం కుదిరిందని, మరే పార్టీతోనూ పొత్తు ఉండబోదని ప్రకటించారు. బీజేపీని ఓడించడమే తమ ప్రధాన లక్ష్యమని, అధికార పీఠాన్ని ప్రభావితం చేయగలిగే సంఖ్యలో సీట్లు గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేసారు. ఏళ్లుగా కేవలం తెలంగాణ, అదీ హైదరాబాద్ పాతనగరానికే పరిమితమైన ఎంఐఎం ఇటీవలికాలంలో పలు ఇతర రాష్ట్రాల్లో పాగా వేయడానికి ప్రయత్నిస్తుండడం దేశవ్యాప్తంగా ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇప్పటికే మహారాష్ట్ర బరిలో నిలిచి ఔరంగాబాద్ లోక్‌సభ స్థానాన్ని, మరో రెండు ఎమ్మెల్యే స్థానాలను గెలిచిన ఆ పార్టీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చాటింది. 20 సీట్లలో పోటీ చేసి ఐదు సీట్లలో విజయం సాధించింది. ఈ గెలుపు స్ఫూర్తితో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో, ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో సైతం పోటీ చేస్తామని ప్రకటించింది. పై ఐదు రాష్ట్రాలే కాకుండా కర్నాటక, తమిళనాడు, గుజరాత్, ఉత్తరాఖండ్, జార్ఖండ్‌లలోనూ ఈ పార్టీకి రాష్ట్ర శాఖలున్నాయి. మేలో ముగిసిన బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లోనూ అభ్యర్థులను నిలిపి ఖాతా తెరువడానికి విఫలయత్నం చేసింది. కేరళ, అస్సాం, జమ్మూ-కశ్మీర్‌లలో తప్ప దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ భవిష్యత్తులో తమ పార్టీ పోటీ చేస్తుందని ఓవైసీ పలుమార్లు చెప్పారు. మజ్లిస్‌ను జాతీయపార్టీగా తీర్చిదిద్దడం కోసం ఏం చేయడానికైనా తాము వెనుకాడబోమని స్పష్టం చేసారు.
కాగా, ఎంఐఎం ఎన్నికల ఎత్తుగడలను పలువురు రాజకీయవాదులు, మేధావులు తప్పుపడుతున్నారు. ఏ ఉద్దేశంతో ఆ పార్టీ వివిధ రాష్ట్రాల్లో పోటీకి దిగినా, అది చివరకు బీజేపీకే లాభిస్తోందని, సాంప్రదాయికంగా ముస్లిం ఓట్లను పొందే లౌకికపార్టీలకు నష్టం చేకూరుస్తోందని ఆరోపిస్తున్నారు. ప్రత్యేకించి 2020 అక్టోబర్-నవంబర్‌లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికలను వారు ఉదహరిస్తున్నారు. స్వల్ప తేడాతోనే అక్కడ లాలూప్రసాద్ కుమారుడు తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ కూటమి అధికారం కోల్పోయిందని, ఎంఐఎం పోటీచేసిన పలు స్థానాల్లో బొటాబొటి మెజారిటీతో ఎన్డీయే అభ్యర్థులు విజయం సాధించారని గుర్తుచేస్తున్నారు. మహారాష్ట్రలోనూ ఇదే జరిగిందని, ఆ పార్టీ 44 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసి కేవలం రెండే గెలిచినా, పలువురు ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి అభ్యర్థులు ఓడిపోవడంలో కీలకపాత్ర పోషించిందని వాళ్లంటున్నారు. ఇప్పుడు యూపీలోనూ అదే జరగనుందని జోస్యం చెబుతున్నారు. అక్కడ అధికార బీజేపీకి ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)లు రెండూ ముస్లిం ఓటు బ్యాంకు కలిగిన పార్టీలని, ఎంఐఎం కనుక ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న వంద సీట్లలో పోటీ చేస్తే నష్టం జరిగేది ఆ రెండు పార్టీలకేనని హెచ్చరిస్తున్నారు. ఆ రాష్ట్రంలో 19 శాతంగా ఉన్న ముస్లిం ఓట్లను ఎంఐఎం చీలుస్తుంది కనుక మధ్యలో బీజేపీ అభ్యర్థులు అవలీలగా గెలుస్తారని అంటున్నారు. బీజేపీని ఓడించే లక్ష్యంతో ఎన్నికల బరిలోకి దిగుతున్నామంటున్న మజ్లిస్ నేతలు చివరకు ఆ పార్టీనే గెలిపించబోతున్నారని ఎద్దేవా చేస్తున్నారు.
ప్రధానంగా ముస్లిం సామాజిక వర్గానికి ప్రాతినిథ్యం వహించే ఎంఐఎం, హిందుత్వ పార్టీగా భావించే బీజేపీని బద్ద విరోధిగా భావిస్తుంది. అనుక్షణం విమర్శలు గుప్పిస్తుంది. అలాంటి పార్టీని ఎందుకు గెలిపించ పూనుకుంటుందన్నది ఇక్కడ అసలు ప్రశ్న. జవాబు కోసం చరిత్ర మూలాల్లోకి వెళ్లాలి. 1927లో ఎంఐఎం అవతరించింది నిజాం రాజుకు అనుకూల పార్టీగానే. హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత యూనియన్‌లో విలీనం చేయకుండా ఒక స్వతంత్ర ముస్లిం రాజ్యంగా, దక్షిణ పాకిస్తాన్‌గా ఉంచాలనే వైఖరిని ఆ పార్టీ అవలంభించింది. 1944లో కాసిం రిజ్వీ చేతికి పగ్గాలు వెళ్లాక రజాకార్ల సంస్థగా మారిన ఎంఐఎం సుమారు లక్షా యాభై వేల సాయుధ సైన్యాన్ని ఏర్పాటుచేసి మొదట కమ్యూనిస్టు గెరిల్లాలతో, తదుపరి యూనియన్ సైన్యాలతో పోరాడింది. తెలంగాణ పల్లెల్లో పలు అరాచకాలకు పాల్పడింది. భారత సైన్యం జోక్యం చేసుకోగా, 1948 సెప్టెంబర్ 17న నిజాం లొంగిపోయారు. హైదరాబాద్ భారత యూనియన్‌లో విలీనమైంది. ఆ వెంటనే ఎంఐఎంపై నిషేధం అమలై అది ఉనికి కోల్పోయింది. తొమ్మిదేళ్ల పాటు జైలులో గడిపిన కాసిం రిజ్వీ 1957లో విడుదలై పాకిస్తాన్‌లో ఆశ్రయం పొందారు. 1958లో ఎంఐఎం తిరిగి అస్తిత్వంలోకి వచ్చింది. లాయర్ అబ్దుల్ వాహెద్ ఓవైసీ ఈ సంస్థ నేతృత్వం స్వీకరించారు. ఆయన అసదుద్దీన్‌కు స్వయానా తాత. 18 ఏళ్ల పాటు పార్టీని నడిపి, 1975లో కుమారుడు సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీకి అప్పగించారు. 33ఏళ్ల అనంతరం సుల్తాన్ మరణించగా, వారసత్వంగా 2008లో అసదుద్దీన్ ఓవైసీ పార్టీ అధ్యక్షుడయ్యారు.
స్వతంత్ర భారతంలో ఎంఐఎం తొలిసారి 1960లో హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి 24 డివిజన్లు గెలుచుకున్నది. ఆ తర్వాత రెండేళ్లకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సలావుద్దీన్ ఎమ్మెల్యే అయ్యారు. ఐదు దఫాలుగా ఆయన వరసగా ఎమ్మెల్యేగా గెలిచి 1984లో హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఘనవిజయం సాధించారు. అప్పటినుంచి ఎంఐఎం ఆ స్థానాన్ని నిలబెట్టుకుంటున్నది. గుర్తింపు పొందిన పార్టీగా మజ్లిస్ 1989 నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నది. ఆ ఏడు నాలుగు, 1994లో ఒకటి, 1999,2004లో నాలుగేసి, 2009లో ఏడు సీట్లను గెలిచింది. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఏడేసి సీట్లను సాధించింది. 2012లో జీహెచ్ఎంసీ మేయర్ పదవిని, పలు దఫాలు డిప్యూటీ మేయర్ పదవిని సైతం చేపట్టింది. అయితే, ఈ అన్ని ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఏదో ఒక ప్రధాన పార్టీతో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకోవడమో లేదంటే పరోక్షంగా అవగాహనకు రావడమో జరిగింది. సెక్యులర్ పార్టీలుగా పేరున్న కాంగ్రెస్‌తో కొన్నిసార్లు కలిస్తే, మరికొన్నిసార్లు టీడీపీతో, ప్రత్యేక తెలంగాణలో టీఆర్ఎస్‌తో ఆ పార్టీ అవగాహన వచ్చి పోటీచేసింది.
మతతత్వ బీజేపీని ఓడించడానికంటూ ఏమాత్రం సంస్థాగత బలం లేని యూపీలో 100 సీట్లలో పోటీ చేస్తానని ఎంఐఎం ప్రకటించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. నిజంగానే కమలం పార్టీని గద్దె దించాలనే చిత్తశుద్ధి ఉన్నట్లయితే, ప్రత్యర్థి పార్టీలైన ఎస్పీ, బీఎస్పీలతో పొత్తు కుదుర్చుకోవాలి. అలా కాకుండా ఉనికిలో లేని చిన్నపార్టీల కూటమి ‘భాగీదారీ సంకల్ప్ మోర్చా’ వేదికగా బరిలోకి దిగడం అనుమానాలకు తావిస్తున్నది. ఎంఐఎం పోటీ చేసే ఆ వంద స్థానాల్లోనూ ముస్లిం ఓటర్లు అధికంగా ఉండి గెలుపును ప్రభావితం చేస్తారు. వీళ్లు కనుక ఎంఐఎంకు ఓటేస్తే బీజేపీకి నష్టం ఉండదు. ఎస్పీ లేదా బీఎస్పీ అభ్యర్థుల ఓట్లే చీలుతాయి. ఫలితంగా కమలనాథులే విజయం సాధిస్తారు. ఈ మాత్రం రాజకీయ సమీకరణాలు అసదుద్దీన్ ఓవైసీకి తెలియవా? ఆయన కూడా యూపీలో బీజేపీ తిరిగి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారా? తద్వారా దేశమంతా హిందువులు బీజేపీ వైపు, ముస్లింలు మజ్లిస్ వైపు పోలరైజ్ అవుతారని భావిస్తున్నారా? జాతీయపార్టీగా మారడమంటే ఆయన ఉద్దేశం అదేనా? లౌకికవాద పార్టీలు ఇక అక్కర్లేదా? భవిష్యత్తులో ఇండియాలో కేవలం మతవాద పార్టీలే ఉనికిలో ఉండాలనుకుంటున్నారా? ఇవన్నీ యక్ష ప్రశ్నలే.
ఇక్కడొక ట్విస్ట్ ఉంది. ఎంఐఎం యూపీలో పోటీచేయడం వెనకాల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోద్బలం ఉందనే మాట ఢిల్లీ వర్గాల నుంచి వినవస్తోంది. మోడీని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన ఈ ఎత్తుగడను ప్రతిపాదించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 2014లో సీఎం అయినప్పటి నుంచీ ప్రధానమంత్రి మోడీతో అనుమానాస్పద సంబంధాలు కొనసాగిస్తున్న కేసీఆర్ పలు కీలక సందర్భాల్లో బీజేపీకి అండగా నిలిచారు. బిహార్‌లో ఎన్డీయేను గెలిపించడంలో, బెంగాల్‌లో మమతను దాదాపు ఓడించినంత పనిచేయడంలో ముస్లిం ఓట్ల చీలిక ఎత్తుగడ ఉపయోగపడిందనడం ఎవరూ కాదనలేరు. ఇప్పుడు యూపీలో సైతం అదే అస్త్రాన్ని ప్రయోగిస్తుండవచ్చునని భావించడం తప్పు కాదు. అసదుద్దీన్-కేసీఆర్‌ల మధ్య ఉన్న స్నేహసంబంధాలను పరిశీలించినా కూడా ఇదే నిజమనిపిస్తుంది. ఏది నిజమో? ఏది అబద్ధమో వచ్చే ఫిబ్రవరి, మార్చిల్లో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికలు తేల్చేయడం ఖాయం. అప్పటి వరకూ వేచిచూద్దాం..! – డి.మార్కండేయ