'కుటుంబానికి రూ.7వేలు, 20 కిలోల బియ్యం ఇవ్వాలి'

by Shyam |
కుటుంబానికి రూ.7వేలు, 20 కిలోల బియ్యం ఇవ్వాలి
X

దిశ, న్యూస్‌బ్యూరో: లాక్‌డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పేద ప్రజలకు రూ.7 వేలు, 20 కిలోల బియ్యం ఇవ్వాలని సీపీఐ డిమాండ్ చేస్తుందని సీపీఐ జాతీయ కార్యదర్శి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే రూ.10 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించి, ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వాలకు విడదల చేయాలని ఆయన కోరారు. లాక్‌డౌన్‌లో ఇబ్బందులు పడుతున్న ప్రజలను, వలస కార్మికులను ఆదుకోవాలని, ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని సీపీఐ జాతీయ సమితి దేశవ్యాప్త పిలుపు మేరకు రాష్ట్రంలో సీపీఐ నాయకులు, కార్యకర్తలు సోమవారం ఒకరోజు ఉపవాస దీక్ష చేపట్టారు. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కె. నారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకటరెడ్డిలు హైదరాబాద్ లోని మగ్దూంభవన్‌లో దీక్షలో కూర్చున్నారు. వీరి దీక్షకు తెలుగుదేశం పార్టీ, తెలంగాణ జన సమితి సంఘీభావాన్ని ప్రకటించాయి. టీజెఎస్ అధ్యక్షుడు కోదండరామ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ సీపీఐ నేతలకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.

ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా గ్రీన్ జోన్లలో మద్యం షాపులు తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతివ్వడాన్ని వ్యతిరేకిస్తున్నమన్నారు. వైన్ షాపుల ఓపెనింగ్‌తో కరోనా కట్టు తప్పుతుందని ఏపీలో అదే జరుగుతోందని హెచ్చరించారు. గోదాముల నిండా ఉన్న ధాన్యాని తక్షణమే అందరికీ బియ్యం పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో త్వరలో వచ్చే కొత్త ధాన్యం దాచేందుకు గోదాములు ఖాళీ అవుతాయని సూచించారు. చిన్న రాష్ట్రం కేరళ కరోనా పోరుకు రూ. 20 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించిందని, కేంద్రం కేవలం రూ. 1.70 కోట్లు ప్రకటించి దేశ ప్రజలను అవమానించారన్నారు. బడా బాబులకు సంబంధించిన రూ.60 వేల కోట్ల రుణాలు మాఫీ చేశారన్నారు. తక్షణమే రూ.10 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించి, వాటిని రాష్ట్రాలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే లాక్‌డౌన్ నిబంధనలను అతిక్రమించైనా ఉద్యమిస్తామని హెచ్చరించారు.

చాడ వెంటకరెడ్డి మాట్లాడుతూ.. అకస్మాత్తుగా లాక్‌డౌన్ ప్రకటించి 42 రోజలు దాటినా వలస కార్మికులకు ప్రభుత్వాలు సరైన వసతులు, ఆహారం కల్పించడంలో విఫలమయ్యాయని విమర్శించారు. దీంతో 43 డిగ్రీల మండే ఎండను లెక్క చేయకుండా స్వస్థలాలకు కాలి బాటన వెళ్తుంటే లాఠీఛార్జ్ చేస్తారా అని ప్రభుత్వంపై చాడ మండిపడ్డారు. హెలికాప్టర్ మనీ పథకాన్ని అమలు చేయాలన్నారు. తాలు పేరుతో ధాన్యం కొనుగోలులో ఐదు కిలోల తరుగు తీయడం దారుణమని, తక్షణమే దానిని అరికట్టాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

tags: Cpi, Narayana, venkat reddy, Kodandaram, Ramana

Advertisement

Next Story

Most Viewed