స్టార్ రెజ్లర్‌కు క్రిమినల్ హిస్టరీ.. నిజమేనా..?

దిశ, స్పోర్ట్స్: భారత దేశ ప్రతిష్టను తన ఆటతో అమాంతం పెంచిన స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ ఒక రోజు ఇలా జైల్లో ఊచలు లెక్కపెడతాడని అనుకున్నారా? ఒలింపిక్స్ వేదికపై మువ్వన్నెల జెండా ఎగురుతుంటే తలపైకి ఎత్తి సగర్వంగా నిలబడిన చాంపియన్.. ఒక రోజు దేశ ప్రజలందరి ముందు సిగ్గుతో తలదించుకొని నిలబడతాడని అనుకున్నారా? కానీ అదే నిజమైంది. ఎంతో మంది రెజ్లర్లకు రోల్ మోడల్ నిలిచిన సుశీల్ కుమార్ ఈ రోజు ఒక హత్య కేసులో […]

Update: 2021-05-26 11:19 GMT

దిశ, స్పోర్ట్స్: భారత దేశ ప్రతిష్టను తన ఆటతో అమాంతం పెంచిన స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ ఒక రోజు ఇలా జైల్లో ఊచలు లెక్కపెడతాడని అనుకున్నారా? ఒలింపిక్స్ వేదికపై మువ్వన్నెల జెండా ఎగురుతుంటే తలపైకి ఎత్తి సగర్వంగా నిలబడిన చాంపియన్.. ఒక రోజు దేశ ప్రజలందరి ముందు సిగ్గుతో తలదించుకొని నిలబడతాడని అనుకున్నారా? కానీ అదే నిజమైంది. ఎంతో మంది రెజ్లర్లకు రోల్ మోడల్ నిలిచిన సుశీల్ కుమార్ ఈ రోజు ఒక హత్య కేసులో దోషిగా నిలబడ్డాడు. రెజ్లింగ్ చరిత్రలో వెజిటేరియన్ రెజ్లర్‌గా పేరు తెచ్చుకున్న సుశీల్.. ఈ రోజు ఒక కరుడు కట్టిన నేరస్తుడిగా పోలీసుల కస్టడీలో ఉన్నాడు. రెజ్లర్‌గా అందరి మన్ననలు పొందాలని కోరుకున్న సుశీల్ చిన్నప్పుడే ఇంటిని వదిలి చత్రాసాల్‌ను తన ఇంటిగా మార్చుకున్నాడు. కానీ అదే చత్రాసాల్‌లో ఒక యువ రెజ్లర్ ప్రాణాలు తీసి హంతకుడిగా మారాడు. అతడే నేరం చేశాడని ఢిల్లీ పోలీసులు అంటుంటే.. తాను నేరం చేయలేదని.. కావాలనే తనను ఇరికించారని సుశీల్ వాదిస్తున్నాడు.

ఢిల్లీలోకి నజఫ్‌ఘడ్ ప్రాంతానికి చెందిన సుశీల్ తండ్రి ఒక బస్ డ్రైవర్. తన కొడుకులో ఉన్న ప్రతిభను చూసి 14వ ఏట చత్రాసాల్ స్టేడియంలో శిక్షణ నిమిత్తం చేర్పించాడు. చిన్నప్పటి నుంచి మాంసాహారం అంటే సుశీల్‌కు పెద్దగా ఇష్టం ఉండదు. దీంతో సుశీల్ తల్లిదండ్రులు తమ స్థోమతకు మించింది అయినా నెయ్యి, వెన్న, రోటీలు, కూరగాయలు ప్రతీ రోజు చత్రాసాల్‌లోని సుశీల్ దగ్గరకు పంపించే వాళ్లు. ఒక వెజిటేరియన్ ప్రపంచ చాంపియన్ అవుతాడని ఏ రెజ్లర్ కూడా నమ్మలేదు. కానీ సుశీల్ దాన్ని నిజం చేసి చూపించాడు. చత్రాసాల్‌లో కఠినమైన శిక్షణ పొందిన సుశీల్ లండన్, బీజింగ్ ఒలింపిక్స్‌లో పతకాలు సాధించి ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగాడు. అయితే హఠాత్తుగా వచ్చిపడిన పేరు, గౌరవంతో సుశీల్ పలు వ్యాపారాల్లోకి ప్రవేశించాడు.

సుశీల్ దందాలేంటి?

ఢిల్లీ చుట్టు పక్కల ఉన్న పలు జాతీయ రహదారులకు సంబంధించిన టోల్ గేట్ కాంట్రాక్టులను పొందాడు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యాణా, పంజాబ్ వైపు వెళ్లే రహదారుల కాంట్రాక్టులు ఎక్కువగా సుశీల్ పేరు మీదనే ఉన్నాయి. దాంతో పాటు రైల్వేలో కమర్షియల్ మేనేజర్ ఉద్యోగం కూడా వచ్చింది. వీటన్నింటినీ అడ్డం పెట్టుకొని పలు అక్రమ దందాలు చేసినట్లు సన్నిహితులు చెబుతున్నారు. ముఖ్యంగా పంజాబ్, హర్యాణా, ఢిల్లీకి చెందిన గ్యాంగ్‌స్టర్లతో సుశీల్‌కు మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. వారిని అడ్డం పెట్టుకొని డ్రగ్స్ సప్లై చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.

స్టేడియంలో పెత్తనం..

చత్రాసాల్ స్టేడియం ఇన్‌చార్జి సత్పాల్ సింగ్ స్వయంగా సుశీల్‌కు గురువు. అంతే కాకుండా ఆయన కూతురినే సుశీల్ పెళ్లి చేసుకున్నాడు. అంతే కాకుండా చత్రాసాల్ స్టేడియంలో సుశీల్ చాలా చిన్నప్పటి నుంచే శిక్షణ పొందుతున్నాడు. దీంతో అక్కడ పెత్తనం అంతా సుశీల్ చేతిలోనే ఉండేది. తనకు ఎదురు తిరిగే ప్రతీ వారిపై ఘర్షణకు దిగేవాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. గతంలో కొంత మంది అంతర్జాతీయ అథ్లెట్లను సుశీల్ కావాలనే డోపింగ్ టెస్టులో ఫెయిల్ అయ్యేలా చేసి అడ్డు తొలగించుకున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. పొద్దున్నే లేచి పూజలు చేస్తూ చాలా మృదువుగా మాట్లాడే సుశీల్ మనసులో ఇంత కఠినంగా ఆలోచిస్తాడని ఎవరూ ఊహించరు. కానీ తన సన్నిహితులైన కొద్ది మందికి మాత్రమే సుశీల్‌లోని వేరే కోణం తెలుసు. సుశీల్ పై చాలా సార్లు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదులు చేసినా వారు పట్టించుకోలేదని తెలుస్తున్నది.

సుశీల్‌తో పాటు ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన అజయ్‌కి అన్ని విషయాలు తెలుసు. సుశీల్‌కు అతడు కుడి భుజంగా ఉండేవాడు. ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగి అయిన అజయ్.. సుశీల్ వెంటే ఉండేవాడు. ఇక మరో అనుచరుడు ప్రిన్స్. ఇతనికి ఢిల్లీలోని పలువురు గ్యాంగ్‌స్టర్లతో సంబంధాలు ఉన్నాయి. సుశీల్ ఘర్షణకు దిగినప్పుడు వీడియోతీసింది ప్రిన్సే. సుశీల్ కోరడంతోనే తాను ఆనాటి ఘర్షణను వీడియోతీసినట్లు చెప్పాడు. ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న సుశీల్ పోలీసులకు అసలు సహకరించడం లేదని తెలుస్తున్నది. పోలీసులు అడిగే ప్రశ్నలకు ఒక్కదానికి కూడా నోరు మెదపడం లేదని సమాచారం. గ్యాంగ్‌స్టర్లతో అతడికి ఉన్న సంబంధాలపై ఆరా తీయలని పోలీసులు భావించినా సుశీల్ సహకరించకపోవడంతో ఎలాంటి సమాచారం బయటకు రావడం లేదు. ఇప్పటికే రెండు రోజుల కస్టడీ పూర్తయ్యింది. మరో నాలుగు రోజుల్లో పోలీసులు మరింత సమాచారం రాబట్టాల్సిన అవసరం ఉన్నది.

Tags:    

Similar News