Pawan Kalyan: అలాంటి వాళ్లు రాజకీయాల్లోకి రాకూడదు.. పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు
తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారులు చేసిన తప్పుకు అందరూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని మండిపడ్డారు. సంక్రాంతి పండుగ సమీపిస్తోన్న వేళ ప్రజలు సరిగ్గా సంబురాలు చేసుకోలేకపోతున్నారని అన్నారు. భయపడే వాళ్లు రాజకీయాల్లోకి రాకూడదని.. తాను తెగించే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. 15 ఏళ్లు కచ్చితంగా పొత్తు ధర్మం పాటించాల్సిందే అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. అభిమానులపై మరోసారి పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు. ఎక్కడ ఎలా స్పందించాలో అభిమానులకు తెలియాలని అభిప్రాయపడ్డారు. ప్రమాద సమయాల్లో కేరింతలు కొట్టడం కరెక్ట్ కాదని అన్నారు.
అందరి భద్రతకు పాటుపడే పోలీసుల(AP Police)కు తప్పకుండా సహకరించాలని కోరారు. తిరుపతి ఘటన(Tirupati Incident)లో కొంతమంది చేసిన తప్పునకు జిల్లా పోలీసు యంత్రాంగం మొత్తం ఫలితం అనుభవించాల్సి ఉంటుందని చురకలు అంటించారు. ఉద్యోగి, అధికారి.. ఎవరైనా వారి బాధ్యతలు సరిగా నిర్వర్తించాలని చెప్పారు. గత ప్రభుత్వంలో అలవాటుపడి కొంతమంది పనిచేయడం మానేశారని మండిపడ్డారు. తప్పు చేస్తే నన్ను కూడా శిక్షించాలని అసెంబ్లీలో చెప్పా.. చాలా పెద్ద మనసుతో గొడ్డు చాకిరీ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు.