Pawan Kalyan:ఆలివ్ రిడ్లీ తాబేళ్ల మరణాలపై ఏపీ డిప్యూటీ సీఎం ఆరా
ఇటీవల కాకినాడ బీచ్, ఉప్పాడ కొత్తపల్లి సముద్ర తీర ప్రాంతాల్లో ఆలివ్ రిడ్లీ తాబేళ్ల మరణాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీశారు.
దిశ,పిఠాపురం: ఇటీవల కాకినాడ బీచ్, ఉప్పాడ కొత్తపల్లి సముద్ర తీర ప్రాంతాల్లో ఆలివ్ రిడ్లీ తాబేళ్ల మరణాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పిఠాపురం పర్యటనలో భాగంగా శుక్రవారం మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్లో సముద్రంలో లభించే వివిధ రకాల మత్స్య సంపదను ప్రదర్శించారు. పండుగొప్ప, టూనా, వంజరం లాంటి చేపలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తిగా తిలకించారు. మండ పీతలు, రొయ్యల లోని వివిధ రకాల వివరాలు ఆ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అటవీ శాఖ స్టాల్లో ఆలివ్ రిడ్లీ తాబేళ్లు తో పాటు వివిధ రకాల పక్షుల నమూనాలను తిలకించారు. ఆలివ్ రిడ్లీ తాబేళ్ల మరణాలకు కారణాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. కోరంగి అభయారణ్యంలో వన్య ప్రాణుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యల పై ఆరా తీశారు.