భోగి మంటలు తారు రోడ్లపై వేయరాదు:జీవీఎంసీ కమిషనర్
నగరంలో ప్రజలు ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగలలో భోగి పండుగ ప్రత్యేకమని, దాన్ని నగర ప్రజలు తారు రోడ్లపై వేయరాదని జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ పి.సంపత్ కుమార్ శుక్రవారం పత్రికా ప్రకటన ద్వారా నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: నగరంలో ప్రజలు ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగలలో భోగి పండుగ ప్రత్యేకమని, దాన్ని నగర ప్రజలు తారు రోడ్లపై వేయరాదని జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ పి.సంపత్ కుమార్ శుక్రవారం పత్రికా ప్రకటన ద్వారా నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జీవీఎంసీ నిధులతో నగర ప్రజల సౌకర్యార్థం వేసిన రోడ్లపై భోగి మంటలు వేయడం ద్వారా రోడ్లపై తారు కరిగి రోడ్లపై గుంతలు ఏర్పడడం వలన నగర సుందరీకరణ కోల్పోవడమే కాకుండా, జివిఎంసికి ఆర్థిక నష్టం వాటిల్లుతుందని, అందువలన రోడ్లపై భోగిమంటలు వేయకుండా మైదానం లేదా ఖాళీ ప్రదేశాల్లో ప్రజలు భోగి మంటలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.
భోగిమంటలు రోడ్లపై వేయడం వలన వాహనదారులకు అసౌకర్యం కలగడమే కాకుండా ఎక్కువగా ప్రమాదాలు జరిగే అవకాశముందన్నారు. భోగి మంటలు తారు రోడ్డుపై వేసే వారిపై జరిమానా విధించడమే కాకుండా చట్టపరమైన చర్యలు చేపడతామని కమిషనర్ హెచ్చరించారు. భోగి మంటలు తారు రోడ్ల పైన, పార్కులలో ఏర్పాటు చేయకుండా ప్రజా ప్రతినిధులు, పలు సంఘాల నాయకులు, నివాసిత సంక్షేమ సంఘాలు, ఎన్జీవోలు సహకరించి రోడ్లను పాడుచేయకుండా ఔత్సాహికులకు అవగాహన కల్పించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.