మళ్లీ డయేరియా కలకలం..37 మంది విద్యార్థులకు అస్వస్థత
అనకాపల్లి జిల్లా వేములపూడిలో డయేరియా విజృంభించింది...
దిశ, వెబ్ డెస్క్: అనకాపల్లి జిల్లా వేములపూడి(Vemulapudi)లో డయేరియా(Diarrhea) విజృంభించింది. దీంతో ఆశ్రమ పాఠశాల విద్యార్థులు 37 మంది అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, విరేచనాలు, వాంతులతో బాధపడుతున్నారు. వీరిలో 13 మందిని వేర్వేరు ఆస్పత్రికి తరలించారు. మిగిలిన విద్యార్థులకు పాఠశాల హాస్టల్‌లోనే వైద్యం అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న వైద్యరోగ్య శాఖ అధికారులు ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల ఆరోగ్యం ఆరా తీశారు. విద్యార్థులు పూర్తిగా కోలుకునే వరకూ వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రస్తుతం విద్యార్థులకు వైద్యం కొనసాగుతోంది. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. అటు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గత నెలలోనే అనకాపల్లి జిల్లా పరవాడ మండలం, భరికం గ్రామంలో డయేరియా విజృంభించింది. వాంతులు, విరేచనాలు, జ్వరంతో ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. దాదాపు 15 మందికి ఆస్పత్రిలో చికిత్స అందించారు. కోలుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డయేరియా ఘటనలు తరచూ నమోదు అవుతున్నాయి. విద్యార్థులు, గ్రామస్తులు అస్వస్థతకు గురవుతున్నారు. విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా విసిరి పలువురు మృతి చెందారు. చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. వీరంతా చికిత్స పొంది ఆస్పత్రుల నుంచి డిశార్జి అయ్యారు. అయితే ఇప్పుడు మరోసారి కూడా డయేరియా విజృంభించడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు.