Bhatti Vikramarka: డిప్యూటీ సీఎం భట్టి.. మాజీ ఉప రాష్ట్రపతి అయ్యాడు! ఫ్లెక్సీ ఫోటో వైరల్
ఏపీ లోని పశ్చిమ గోదావరి జిల్లా రాజమండ్రిలో (World Telugu Conferences) ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీ లోని పశ్చిమ గోదావరి జిల్లా రాజమండ్రిలో (World Telugu Conferences) ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించారు. గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ (జీజీయూ) వేదికగా ఈ నెల 8, 9 తేదీల్లో మహాసభలు జరిగాయి. ఈ మహాసభలు ప్రారంభోత్సవానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులకు అహ్వానాలు పంపించారు. దాదాపు 560 మంది కవులు పాల్గొన్నారు. ఈ మేరకు ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరయ్యే ప్రముఖులకు స్వాగతం పలుకుతూ తెలుగు భాష ఔత్సాహికులు పోస్టర్లు, బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka)కు సైతం స్వాగతం చెబుతూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసినట్లు సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతోంది. అందులో ప్రపంచ తెలుగు మహాసభలకు విచ్చేస్తున్న భారత మాజీ ఉప రాష్ట్రపతి శ్రీ మల్లు భట్టి విక్రమార్కకు స్వాగతం అంటూ ఫ్లెక్సీ పెట్టారు. డిప్యూటీ సీఎం అయిన భట్టి.. భారత మాజీ ఉపరాష్ట్రపతి (former Vice President) అని రాసి ఉండటం ఏమిటని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. డిప్యూటీ సీఎం.. ఇప్పుడు మాజీ ఉప రాష్ట్రపతి అయ్యాడని నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. ఇంకా నయం అమెరికా అధ్యక్షుడు అని పెట్టాల్సింది.. అంటూ మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు. అయితే వైరల్ అవుతున్న భట్టి విక్రమార్క ఫ్లెక్సీ ఫేక్ లేదా నిజంగానే తప్పుగా పోస్టర్ వేయించారనేది తెలియాల్సి ఉంది.