‘వి’ సినిమాకు మిశ్రమ స్పందన?

దిశ, వెబ్‌డెస్క్: కరోనా పుణ్యమాని థియేటర్‌లో పాప్‌కార్న్ తింటూ ఎంజాయ్ చేయాల్సిన సినిమాను, చెవుల్లో హెడ్‌సెట్ పెట్టుకుని కావాల్సినన్నిసార్లు ఆపుకుంటూ, ప్లే చేసుకుంటూ చూసే పరిస్థితి వచ్చింది. ఏంటో ఎంత కొత్త సినిమా అయినా అలా చూస్తే వచ్చే మజానే వేరు. అలా మొదటగా విడుదలైన మొదటి పాపులర్ తెలుగు సినిమా ‘వి’. నాని, సుధీర్ బాబు, అదితీ రావ్ హైదరీ, నివేదా థామస్ నటించిన ఈ చిత్రాన్ని శుక్రవారం రాత్రి 9:30 గంటలకు అమెజాన్ ప్రైమ్‌లో విడుదల […]

Update: 2020-09-05 04:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా పుణ్యమాని థియేటర్‌లో పాప్‌కార్న్ తింటూ ఎంజాయ్ చేయాల్సిన సినిమాను, చెవుల్లో హెడ్‌సెట్ పెట్టుకుని కావాల్సినన్నిసార్లు ఆపుకుంటూ, ప్లే చేసుకుంటూ చూసే పరిస్థితి వచ్చింది. ఏంటో ఎంత కొత్త సినిమా అయినా అలా చూస్తే వచ్చే మజానే వేరు. అలా మొదటగా విడుదలైన మొదటి పాపులర్ తెలుగు సినిమా ‘వి’. నాని, సుధీర్ బాబు, అదితీ రావ్ హైదరీ, నివేదా థామస్ నటించిన ఈ చిత్రాన్ని శుక్రవారం రాత్రి 9:30 గంటలకు అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేశారు. పెట్టిన వెంటనే చాలా మంది తెలుగు ప్రేక్షకులు రాత్రంతా కూర్చుని సినిమా చూసేసి, తెల్లారుజామునే వాట్సాప్ స్టేటస్, సోషల్ మీడియాల్లో రివ్యూలు పెట్టేశారు. అందుకే ప్రత్యేకంగా మళ్లీ రివ్యూ ఎందుకని, ఆ రివ్యూల్లో ఏమనుకున్నారో చెప్పే ప్రయత్నం చేస్తున్నాం.

చెప్పడానికి ఇబ్బందిగానే ఉంది గానీ.. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసి మంచి పనే చేశారని చాలా మంది అభిప్రాయపడ్డారు. నాని అంచనాలను మించేలా తీస్తాడనుకుని భారీగా అంచనాలు పెట్టుకుంటే అవి పటాపంచలు అయ్యాయని పోస్టులు చేశారు. ఇక ఈ విషయాలను పరోక్షంగా చెబుతూ తెల్లారేసరికి లక్షల్లో మీమ్స్ వచ్చిపడ్డాయి. ఈ మీమ్స్‌లో ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌ను ఆడుకున్నారు. మ్యూజిక్ డైరెక్షన్ చేసే చాన్స్‌ను తనకు ఇవ్వకుండా అమిత్ త్రివేదిని పెట్టుకున్నందుకు ఇలా చేసి ఉంటాడని మీమర్‌లు కామెంట్ చేశారు. ‘రాక్షసన్, సాహో’ సినిమాల్లో సంగీతాన్ని అచ్చుగుద్దినట్టు కాపీ కొట్టి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడని కామెంట్‌లు చేశారు.

ఇక నటీనటుల విషయంలో నాని కంటే సుధీర్ బాబు నటనకు ఎక్కువ మార్కులు పడటం గమనార్హం. ఆదిత్య అనే పోలీసాఫీసర్‌గా ఆయన నటనకు ప్రేక్షకులు మంచి ప్రశంసలు ఇచ్చారు. నాని బాగానే నటించాడు కానీ, కొత్తదనం ఏం లేదంటూ చాలా మంది పెదవి విరిచారు. అయితే ఇద్దరు కలిసి ఉన్న సీన్లలో మాత్రం ఒకరికొకరు పోటాపోటీగా నటించారని కొనియాడారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో కొత్తదనాన్ని ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. సాధారణంగా ఆయన సినిమాల్లో హీరోయిన్లకు కూడా హీరోలతో సమానంగా ప్రాముఖ్యత ఉంటుంది. కానీ ఈ సినిమాలో మాత్రం ఏ మాత్రం ప్రాధాన్యత లేదు. నివేదా, అదితిల పాత్రలు చాలా కామన్‌గా ఉన్నాయని ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేశారు. కనీసం వారి గురించి చెప్పుకోదగ్గ ఒక్క విషయం కూడా లేదని అంటున్నారు. సాంకేతికపరంగా సినిమాటోగ్రఫీకి మంచి మార్కులు పడగా, ఎడిటింగ్‌ను విమర్శించిన వారు చాలా మందే ఉన్నారు. ఇక ఎప్పటిలాగే దిల్ రాజు నిర్మాణ విలువలకు కూడా మంచి మార్కులిచ్చి ఈ సినిమాకు ప్రేక్షకులు మిశ్రమంగా స్పందించారు.

Tags:    

Similar News